స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ అభివృద్ధి గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న రజనీకాంత్ కు అర్థమవుతోంది కానీ ఇక్కడ ఉన్న గజనీలకు మాత్రం అర్థం కావట్లేదని ఆయన విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్‌లో పర్యటించిన ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాలు కేసీఆర్ ను గద్దె దించుతామని అంటున్నాయని.. అసలు కేసీఆర్ ను ఎందుకు దించాలని ప్రశ్నించారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినందుకు దించుతారా? లేక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి రైతులకు నీళ్లు ఇస్తున్నందుకా? దించేస్తారా? అని ప్రశ్నించారు. అలాగే లింగాయత్‌లను ఓబీసీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపామన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే లింగాయత్‌లను ఓబీసీలో చేర్చేలా కేంద్ర పెద్దలను ఒప్పించాలని డిమాండ్ చేశారు.
కాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడ విచ్చేసిన రజనీకాంత్.. చాలా కాలం తర్వాత ఇటీవల హైదరాబాద్ వెళ్లానని.. అప్పుడు నగరాన్ని చూసి న్యూయార్క్ లో ఉన్నానా? అనిపించిందని తెలిపారు. చంద్రబాబు విజన్ తోనే ఇది సాధ్యమైందని రజనీ వ్యాఖ్యానించారు.