స్వతంత్ర, వెబ్ డెస్క్: భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను జూన్ 9లోగా అరెస్టు చేయాలని భారతీయ కిసాన్ సంఘం డిమాండ్ చేసింది. అరెస్ట్ చేయకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని రైతు నేత రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. అంతేకాకుండా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళన చేసుకునేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్తంగా రైతు సంఘం నేతలు గురువారం ఆందోళనలు చేపట్టారు. జంతర్‌మంతర్‌లో ఆందోళనకు అనుమతించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కోరారు. నెల రోజులుగా సాగుతున్న రెజ్లర్ల ఆందోళనకు త్వరగా ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. కాగా బ్రిజ్‌భూషణ్ తమను లైంగికంగా వేధించారంటూ రెజ్లర్లు సాక్షిమాలిక్, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా, సంగీత ఫొగాట్ తదితరులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.