స్వతంత్ర వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియను జీహెచ్ఎంసీ మరింత వేగవంతం చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి , డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఇప్పటికే 70 వేల ఇండ్లు నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని అధికారులు మంత్రులకు తెలియజేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తి కావొచ్చిందని తెలిపారు.