స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. జనగణనలో భాగంగా కులగణన చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో బీసీల సదస్సు నిర్వహించారు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే జయంతిని పురసరించుకొని ఇందిరాపార్కు వద్ద ఈ బీసీ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని.. కర్నాటక, బిహార్ వంటి విఫల యత్నాల అనుభవాలు ఉన్నా తొలుత డేడికేటెడ్ కమిషన్ వేయలేదని అన్నారు. తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడం, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదని అన్నారు. బీసీల లెక్కలు ఒక కమిషన్ తీస్తుంటే…మరో కమిషన్ నివేదిక ఇస్తుందని చెప్పారు. ఇలా చేస్తే కోర్టుల్లో నిలబడుతుందా ? అని కవిత ప్రశ్నించారు.
42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందే.. లేదంటే బీసీల జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికలకి వెళ్లాలని అన్నారు. దొంగ లెక్కలు, కాకిలెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలని చెప్పారు.
మన ఉద్యమాల వల్లే సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. మన ఉద్యమాలతో జంగుపట్టిన ప్రభుత్వ రథచక్రాలు కదులుతున్నాయిని సెటైర్లు వేశారు బీసీలకు మంచి రోజులు వస్తాయని కవిత అన్నారు. కులం ఆధారంగా రాజ్యంగ నిర్మాతలు కొన్ని రక్షణలు కల్పించారని గుర్తు చేశారు . అంబేద్కర్ కృషి చేయకుంటే ఎస్సీ,ఎస్టీలకు ఎటువంటి ఫలాలు దక్కకపోతుండేవని అన్నారు. బీసీ కులాలకు రాజ్యాంగంలో రక్షణ కల్పించాల్సింది.. ఆనాడే బీసీలకు రాజ్యంగపరమైన రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారతదేశం అమెరికాను దాటేసేదని చెప్పారు.
మొదటి ప్రధాని నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారని … ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా…? అని ప్రశ్నించారామె. మండల్ కమిషన్ ను మొరార్జీ దేశాయ్ నియమించారని… కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదు… మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది కానీ అమలు చేయలేదని అన్నారు.
1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు…? మళ్లీ కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసింది. బీసీల కోసం పని చేస్తున్న
వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టింది. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహీర్గతం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదు. కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి,. నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా .
కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయి. కేసీఆర్,ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు జరిగిన లాభం ఏమిటో ఆలోచించాలి . సావిత్రీబాయి పూలే ఆడబిడ్డ కాదు… పులిబిడ్డ. మహిళా విద్యకు కృషి చేశారు. ఎంతో మంది మహిళలకు చదువును నేర్పించారు. సావిత్రీబాయి ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమాజ వికాసం కోసం పని చేశారు… అని కవిత అన్నారు.