ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు వెళ్లే వేలాది మంది భక్తులు భారీ ట్రాఫిక్ జామ్‌ల కారణంగా రహదారులపై చిక్కుకుపోయారు. వందల కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాగ్ రాజ్ కు వెళ్లే మార్గాల్లో. చిక్కుకున్న వాహనాల క్యూ 300 కిలోమీటర్ల వరకు విస్తరించింది.
వసంత పంచమి పుణ్య స్నానాల తర్వాత అయినా రద్దీ తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇందుకు భిన్నంగా ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు చేసేందుకు వేలాది మంది భక్తుల రాక కొనసాగుతోంది.
ఇక ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారడంతో పొరుగున ఉన్న మధ్య ప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో ప్రయాగ్ రాజ్ కు వెళ్లే మార్గాల్లో రాకపోకలు సాగించకుండా వాహనాలను నిలిపివేశారు.
వారణాసి, లక్నో , కాన్పూర్ నుండి ప్రయాగ్ రాజ్ కు దారితీసే మార్గాల్లో 25 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మహా కుంభమేళా జరుగుతున్న నగరం లోపల కూడా సుమారు ఏడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని డీజీపీ సాకేత్ ప్రకాశ్ పాండే తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితిక చేరుకోవడానికి కనీసం రెండు రోజులు పడుతుందని చెప్పారు.
తాము 48 గంటలుగా ట్రాఫిక్ లో చిక్కుకుపోయామని .. 50 కిలోమీటర్ల ప్రయాణానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని .. ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన ఓ భక్తుడు చెప్పాడు.
మరోవైపు ప్రయాగ్ రాజ్ సంగం స్టేషన్ బయట భారీ రద్దీ నెలకొనడంతో .. ప్రయాణికులు బయటకు రావడానికి ఇబ్బందులు పడతారని.. రైల్వే స్టేషన్ మూసివేయాలని నిర్ణయించినట్టు రైల్వే అధికారి కుల్ దీప్ తివారీ చెప్పారు.