అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు సాధించిన బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరింత దిగజారింది. అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు..? కాంగ్రెస్ వ్యూహాలకు బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతోంది..? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి.?
సార్వత్రిక ఎన్నిలక ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ను విలీనం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాల్సిందిగా పోచారంను కోరారు. సీఎం ఆహ్వానంతో కుమారుడితో కలిసి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడానికి గల కారణంపై వివరణ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసమే పార్టీ మారానని, రాజకీయంగా తానేమీ ఆశించ ట్లేదని చెప్పారు. గత ఆరు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని, రైతుల సంక్షేమం కోసం నిజాయతీగా పాటుపడుతోందని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రైతులను ఆదుకునే విషయంలో వెనుకడుగు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే మొదలైందని ఆయన గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ప్రగతి, రైతుల కోసం పనిచేస్తానని వివరించారు.
ఈనేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి పోచారం చేరికపై స్పందించారు. రైతుల సంక్షేమానికి పోచారం ఎన్నో సేవలు అందించారన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్‌లో చేరారన్నారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళ్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. ఇది రైతు రాజ్యం. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు. భవిష్యత్‌లో పోచారంకి సముచిత గౌరవం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోచారం ఇంట్లో సీఎం రేవంత్ ఉండగానే ఇంటి బయట బీఆర్ఎస్ నేత బాల్క సుమన్, ఇతర నేతలు నిరసనలకు దిగారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బాల్క సుమన్‌తో పాటు ఇతర నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.ఇదిలా ఉంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక కూడా త్వరలో ఉంటుందన్నారు. ఇక మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్‌ను ముంచాయని దానం ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఆ పార్టీ మరెన్ని అడ్డంకులను ఎదుర్కోబోతుందో..?