సినిమా ప్రపంచంలో స్టార్లు చాలామంది ఉంటారు.అయితే మెగాస్టార్ ఒక్కరే. ఆయనే చిరంజీవి. తెలుగు సినిమా ప్రపంచంలో చిరంజీవిది ఒక శకం. టాలీవుడ్‌లో చిరంజీవి ఓ ప్రభంజనం…ఓ సునామీ. నటన అంటే కమల్ హసన్ ….స్టయిల్ అంటే రజనీకాంత్. అయితే ఈ రెండూ ఉన్న కథానాయకుడు చిరంజీవి. ఈ మాట అన్నది ఎవరో కాదు. ..అగ్ర దర్శకుడు కే. బాలచందర్. ఆయన మాటను అనేకసార్లు రుజువు చేశారు మెగాస్టార్. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వర ప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. డిగ్రీ చదువుతున్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. సినిమాల్లో నటించాలన్న కోరికతో చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అక్కడే నటనలో ఓనామాలు నేర్చుకున్నారు. ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలైంది.
కొణిదెల వారబ్బాయి స్వతహాగా ఆంజనేయస్వామి భక్తుడు. ఓరోజు కలలో కనిపించి చిరంజీవి అని పిలిచారట ఆంజనేయస్వామి. దీంతో మాతృమూర్తి సలహా మేరకు సినిమాల కోసం చిరంజీవి అని పేరు పెట్టుకున్నారు శివశంకర్ వర ప్రసాద్. పునాదిరాళ్లు …సినిమా కోసం తొలిసారి కెమేరా మందు నిలబడ్డారు చిరంజీవి. పునాదిరాళ్లు …చిరంజీవి తొలి చిత్రం. అయితే చిరంజీవి నటించగా విడుదలైన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. ప్రాణం ఖరీదులో చిరంజీవిని చూసి చాలా మంది సినిమా పెద్దలు .. ఈ కుర్రాడు ఏదో ఒక రోజు పెద్ద స్టార్ అవుతాడని జోస్యాలు చెప్పారు. ఈ జోస్యాలు నిజమయ్యాయి. చిరంజీవి సాధారణ స్టార్ కాదు…మెగాస్టార్ అయ్యారు.
సత్తా ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో చిరు నటించిన ఖైదీ విడుదల అయింది. ఖైదీ సినిమా బాక్సాఫీసు దగ్గర హిట్టయింది. అలా ఇలా కాదు…సూపర్ డూపర్ హిట్టయింది. అంతేకాదు ఖైదీ సినిమాతో చిరంజీవికి స్టార్‌డమ్ వచ్చింది. కెరీర్‌పరంగా చిరంజీవి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్లారు. 1990వ దశకంలో చిరంజీవి సినిమాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. జగదేక వీరుడు – అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, అల్లుడా మజాకా, ఇంద్ర, ఠాగూర్, శంకర్‌దాదా ఎంబీబీఎస్…లాంటి సినిమాలు బాక్సాఫీసును బద్దలు కొట్టాయి. సినిమాల్లో డ్యాన్సులకు, ఫైట్లకు చిరంజీవి సరికొత్త నిర్వచనం చెప్పారు. చిరంజీవితో డ్యాన్సులు చేయడం అంత ఈజీ కాదంటారు హీరోయిన్లు. డ్యాన్సుల్లో చిరంజీవి ఏ రేంజ్‌కు వెళ్లారో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. సినిమారంగంలోనే కాదు…సేవారంగం లోనూ చిరంజీవి తనదైన మార్క్ వేశారు. మదర్ థెరిస్సా స్ఫూర్తితో 1998లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తితో లక్షలాదిమంది అభిమానులు రక్తదానం చేశారు. అనేకమంది ప్రాణాలు కాపాడారు. ఒకదశలో రాజకీయాల్లోనూ ప్రవేశించారు చిరంజీవి. 2008లో ప్రజారాజ్యం పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. 2012 నుంచి ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. కాగా 2012 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో పర్యాటక శాఖమంత్రిగా పనిచేశారు.
మెగాస్టార్‌కు అవార్డులు కొత్తకాదు. 2026లో కేంద్ర ప్రభుత్వం నుంచి చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకు న్నారు. అదే ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.2016లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ నటుడిగా అనేకసార్లు నంది పురస్కారాలు చిరంజీవికి లభించా యి. వీటితోపాటు 2022లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు చిరంజీవి ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే 1987లో ప్రఖ్యాత ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవానికి చిరంజీవి ఆహ్వానం అందుకు న్నారు. చిరంజీవికి సేవాగుణం కూడా ఎక్కువే. దాదాపు మూడేళ్ల కిందట కోవిడ్ విజృంభించిన సమయంలో తెలుగు సినిమా పరిశ్రమ స్తంభించిపోయింది. ఎక్కడి షూటింగ్‌లు అక్కడే ఆగిపోయాయి. దీంతో సినిమా పరిశ్రమపై ఆధారపడి బతికే జూనియర్ ఆర్టిస్టులు, షూటింగ్ బాయ్‌లు, క్లాప్ కొట్టే కుర్రాళ్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు …ఇలా అందరికీ ఉపాధి పోయింది. షుటింగులు లేకపోవడంతో వీరంతా రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి సీసీసీ పేరుతో ఒక సంస్థను చిరంజీవి ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా విరాళాలు సేకరించారు. కార్మికులను ఆదుకున్నారు. చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించడమంటే అది ఆయనకు వ్యక్తిగతంగా లభించిన పురస్కారం కాదు. తెలుగు సినీపరిశ్రమకు లభించిన పురస్కారంగానే భావించాలి. ఏమైనా…జై చిరంజీవ.