సీతమ్మలేని రామచంద్ర ప్రభువును ఎవరూ ఊహించుకోలేరు. యావత్ భారతీయులకు సీతాదేవే మహా తల్లి. సీతా దేవిని సాధ్వీమణిగా ప్రపంచమంతా కొనియాడుతుంది. క్షమ..దయ…ధైర్యం…వివేకం…ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన మహిళ ఎవరో కాదు…సీతమ్మ తల్లే. సీతమ్మ లేకుండా శ్రీరాముడి జీవితాన్ని ఎవరూ ఊహించలేరు. సీతా దేవిలోని సుగుణాలు ఇప్పటికీ అందరికీ ఆదర్శం. సీతమ్మ చరితం ఓ స్ఫూర్తిదాయకమైన కథాసాగరం. రామాయణం లో ఏ ఘట్టం తీసుకున్నా సీతమ్మ తల్లి గుణగుణాలు అందరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.
సీతమ్మ తల్లి ఓ ధర్మమూర్తి. సీతాదేవి ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో పాలుపంచుకున్న ఆదర్శ గృహిణి. సీతాదేవిని మహాసాధ్వి అంటారు. తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి రామచంద్రప్రభువు అరణ్యవాసానికి వెళ్లినప్పడు తన భర్త అడుగుజాడల్లో తనూ నడిచింది. ధర్మపత్నిగా రామచంద్ర ప్రభు కష్టసుఖాల్లో పాలు పంచుకో వడానికి సిద్ధమైంది. కడదాకా తన ధర్మాన్ని నిర్వర్తించింది.ఎవరినైనా ఆదరించి అన్నం పెట్టాలన్న దయాగుణం మహిళామూర్తి సీతాదేవి. అదే భావనతో తనింటికి మారువేషంలో బిక్షాటన వచ్చిన రావణుడికి లక్ష్మణరేఖ దాటి మరీ భిక్షం వేసిన దయామూర్తి సీతమ్మ తల్లి. తన రక్షణ కోసం పెట్టుకున్న నియమం కన్నా దానమే గొప్పదన్న నీతిని సీతాదేవి పాటించింది.
సీతమ్మ తల్లి జన్మస్థలం జనక్‌పూర్. ప్రస్తుతం నేపాల్‌లో ఉంది జనక్‌పూర్. ఈ ప్రాంతాన్ని జనక్‌ధామ్ అని కూడా పిలుస్తారు. ఖాట్మండుకు నైరుతి దిశగా 123 కిలోమీటర్ల దూరంలో జనక్‌ధామ్ ఉంటుంది. జనక మహారాజు ప్రస్తుత నేపాల్‌లోని వైదేహీ రాజ్యాన్ని పాలించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో వ్యవసాయ భూమిని నాగలితో దున్నుతన్నప్పుడు, ఒక పెట్టెలో సీతమ్మదేవి దొరికిన సంగతి తెలిసిందే. సుర్కి శోర్దాస్ అనే సన్యాసికి 1657లో సీతారా ముల విగ్రహాలు దొరికాయి. ఈ నేపథ్యంలో 1910లో జానకీ పేరుతో ఓ మందిరాన్ని అప్పటి నేపాల్ రాణి వృషభాను నిర్మించారు. ఈ ఆలయమే కాలక్రమంలో జానకీమందిర్ గా విఖ్యాతి పొందింది. వేలగజాల విస్తీర్ణంలో 150 అడుగుల ఎత్తున ప్రాకారంలో అప్పట్లో జానకీమందిర్ ను నిర్మించారు.
పాలరాతి గోడలు, అద్దాల మేడలతో నిర్మించిన జానకీమందిర్‌కు అప్పట్లోనే తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చయి నట్లు చెబుతారు. ఈ కారణంతోనే జానకీ మందిర్‌ను నౌ లాఖ్ మందిర్ అని కూడా పిలుస్తారు. జానకీమందిర్ నిర్మించ న స్థలంలోనే సీతమ్మవారు శివ ధనస్సును పూజించినట్లు చెబుతారు. సీతారాముల వివాహం రత్నసాగర మందిరం కూడా ఇక్కడకు దగ్గరలోనే ఉంటుంది. దీంతో జానకీమందిర్ నైరుతి దిక్కున ఓ పెద్ద వివాహ మండపాన్ని నిర్మించారు. ప్రతిఏడాది మార్గశిర మాసం శుక్ల పంచమిరోజున ఇక్కడ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.రామచంద్రుల ప్రభుకు జనక్‌పూర్ అత్తవారిల్లు . దీంతో తమ అల్లుడైన అయోధ్యారాముడికి జనక్‌పూర్ వాసులు వేలాదిగా కానుకలు పంపారు. ఒకటి కాదు….రెండు కాదు..మూడు వేలకుపైగా కానుకలు జనక్‌పూర్ వాసుల నుంచి అయోధ్యారాముడికి అందాయి. జనక్‌పూర్ నుంచి అయోధ్య వరకు మొత్తం 36 ప్రత్యేక వాహనాల్లో అత్తవారింటి నుంచి శ్రీరాముడికి ఈ కానుకలు అందాయి. 500 మందికిపైగా రామభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామచంద్ర ప్రభువుకు అత్తవారింటి నుంచి వచ్చిన కానుకలు చూసి అయోధ్యావాసులు ఎంతగానో సంతోషిం చారు. కానుకలు తీసుకువచ్చిన ప్రత్యేక వాహనాలకు అయోధ్యావాసులు ఘన స్వాగతం పలికారు. ఈ కానుకలలో పట్టు పీతాంబరాలు, బంగారు, వెండి ఆభరణాలు ప్రధానంగా ఉన్నాయి. అలాగే హిమాలయ ప్రాంత స్ఫూర్తిని ప్రతిబింబించే డ్రై ఫ్రూట్స్, నేపాల్ ప్రాంతానికి చెందిన తినుబండారాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా త్రేతాయుగం నుంచి నేపాల్ – భారత్ దేశాల మధ్య ఉన్న సంబంధాలు, ఆధ్యాత్మిక బంధాన్ని పండితులు గుర్తు చేసుకున్నారు. నేపాల్ నుంచి వచ్చిన ప్రత్యేక కానుకలను దైవిక ఆశీర్వాదాలుగా పండితులు పేర్కొన్నారు.


