23.6 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

సినిమాల్లో సంక్రాంతి పాటల సందడి

     సినీ వినీలాకాశంలో సంక్రాంతి సినిమా అంటే తెలుగు నాట ప్రత్యేక ఆదరణ ఉంటుంది. తెలుగు వాళ్లకు వెండితెర పరిచయం అయినప్పటి నుంచి .సంక్రాంతి సినిమాలు ఘన విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో తప్పనిసరిగా సంక్రాంతి జీవన క్రాంతులను ప్రకటించే పాటలు ఎన్నో వచ్చాయి. ప్రతీ సినిమాలో సంక్రాంతి పాట తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఉల్లాసపరిచింది. తేనెలూరే తేట తేట తెనుగు పాటల సొబ గులను వీనుల విందుగా ఆరగిస్తే సంక్రాంతి పండగ నిజంగా పండగై మనసుని ఆహ్లాదపరుస్తుంది.మరి దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సంక్రాంతి పాటల పరిమళాల పూదోటల్లోకి అలా వెళదామా…!

రక్షరేఖ – 1949
తెలుగు సినిమా ప్రపంచంలో 1949లో సంక్రాంతికి విడుదలైన ‘రక్షరేఖ’ చిత్రంలో తొలి సంక్రాంతి సినీ పాట పరిచయం అయ్యింది. పద్మనాభన్‌ ప్రొడక్షన్స్‌ పతాకాన ఆర్‌. పద్మనాభన్‌ దర్శకత్వంలో రూపొందగా బలిజేపల్లి లక్ష్మీకాంతం కలం నుండి కమనీయంగా జాలువారింది. ఈ పాట చిత్ర ప్రారంభంలోనే “రాజ్యమంతా సంక్రాంతి వినోదాలతో ఆనందించే సందర్భంగా చిత్రీకరింపబడింది. ‘పండుగ పొంగళ్ళు గంగమ్మా! పాలవెల్లి పొంగళ్లు, కమ్మని పాయసాలు పొంగే ఆర గింపు గంగమ్మ తల్లి’ అనే పల్లవితో ప్రారంభమయ్యే ఈ పాట చరణాల్లో చెరుకుతీపి, గోమాత పవిత్రత, రాట్నం విశిష్టత, రంగుల రాట్నం సరదాల వర్ణన వుంది. ఆనాటి తరాన్ని ఈ పాట ఒక ఊపు ఊపింది .

సంక్రాంతి – 1952
ఒకప్పటి తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడు సి. పుల్లయ్య అంటే తెలియని తెలుగు వాళ్లే ఉండరు. ఆయన దర్శక త్వం వహించిన ‘సంక్రాంతి’ సినిమా 1952లో విడుదలైంది. ఈ చిత్రంలో బలిజేపల్లి రాసిన ‘జేజేలమ్మా జేజేలు – సంక్రాం తిలక్ష్మికి జేజేలు …. బాజాలు, భజంత్రీలు – సంక్రాంతి లక్ష్మికి జేజేలు’ అనే పాట అప్పట్లో సినీసంగీత అభిమా నులను ఆనందపారవశ్యంలో ముంచెత్తింది. మదిమదిని మురిపించి అలరించింది. ఈ పాటతోపాటు చిత్ర ప్రారంభంలో ఉన్న వీధి భాగవతంలో కూడా సంక్రాంతి ప్రసక్తి వుంది. ‘క్రాంతి, ఈనాడు మకర సంక్రాంతి వెలుగొందు మా నృత్యకాంతి, మము జూడ మీకు విభ్రాంతి ‘అనే వాక్యాలు చిత్రం క్లైమాక్స్ లో మళ్లీ వస్తాయి.

పల్లెటూరు – 1952
తెలుగు, తమిళ, హిందీ సినీరంగాల్లో సుప్రసిద్ధ దర్శకుడిగా ప్రసిద్ది చెందిన టి. ప్రకాశరావు దర్శకత్వంలో ‘పల్లెటూరు’ సినిమా 1952లో విడుదలైంది. ఈ చిత్రంలో సుంకర వాసిరెడ్డి రచించిన పాట ఆరు చరణాలతో సుదీర్ఘమైన సంక్రాంతి సంబరాల పాట ఉంది. “వచ్చిందోయ్‌ సంక్రాంతి, విచ్చెను నూతనకాంతి”..అంటూ రసవత్తరంగా ఈ పాట సాగుతుం ది. ఈ పాటలో ఆకాశాన్ని అంటే మంటలు, బంగారపు పంటలు, ముగ్గుల మురిపాలు, కోకిలలు-కొత్తకాంతులు, గొబ్బి ళ్లు, కోడిదూడలు, హరిభజనలు మొదలైన అనేక అంశాలు తొంగిచూస్తాయి.తెలుగింటి సంక్రాంతిని పదపదాన పొంది కగా అమర్చారు గేయ రచయిత.

నా యిల్లు – 1953
నాగయ్య దర్శకత్వంలో ‘నా యిల్లు’ సినిమా 1953లో విడుదలైంది. ఈ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుంచి వెలువడిన గీతం పూర్తిగా సంక్రాంతి శోభను అందంగా, రసరమ్యంగా వర్ణించింది. “గొబ్బిళ్లో గొబ్బిళ్లో వచ్చెనమ్మ సంక్రాంతి, పచ్చని వాకిట చేమంతి… ముంగిట రంగుల ముగ్గుల్లో ముద్ద బంతి… మొగ్గల్లో ముద్దియలుంచే గొబ్బిళ్ళో గొబ్బిళ్లో – అంటూ పల్లవితో సాగే ఈ పాట పచ్చని జనప చేలు, సెనగ పూలు, కాపుల పొలికేకలు, పైర గాలి పలకరింపు లకు పులకించే, ఆడపడుచుల విలాసాలను అక్షరాలకు అద్ది పదాలుగా కూర్చి తేనెలూరే తేటతెలుగు పాటను మనకు అందించారు. ఇలాంటి పాటలు ఈ రోజుల్లో వస్తే ఎంత బాగుంటుందో అనిపిసస్తుంది. సంగీతం కన్నా సాహిత్యానికి ప్రాధాన్యం ఉన్న పాటలు మరిన్ని రావాలనిపిస్తుంది ఈ పాట వింటే….

కుటుంబ గౌరవం – 1957
విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకాన బి.ఎస్‌.రంగా నిర్మించి, దర్శకత్వం వహించిన ‘కుటుంబ గౌరవం’ చిత్రంలోని చివరిపాట నాయిక నాయకులపై కోరస్‌తో చిత్రీకరించారు. ‘అనిశెట్టి’ కలం నుంచి వెలువడిన ఆ పాట 1957లో నాటి ప్రేక్షకుల్ని లాలించి అలరించింది. సంక్రాంతిని మన కళ్ల ముందు ఉంచింది. ‘పాడవోయి రైతన్నా ఆడవోయి మా యన్నా పంట లింటి కొచ్చె నేడు..పండుగ మన పల్లెలోన సంతసాలు నిండగ’ అంటూ సాగింది. ఈ పాట సంక్రాతిని రస రమ్యంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించింది.

నమ్మిన బంటు – 1959-60
‘నమ్మిన బంటు’ సినిమా మాయాబజార్ వచ్చిన రెండేళ్లకి…అంటే 1959-60లో విడుదలైంది. ఈ చిత్రంలో రైతు సేద్యంలో సాయం చేసే బసవన్నల పై కమ్మని పాటను జానపద సరళిలో కొసరాజు రాశారు. బసవన్నలు లేనిదే పాడి పంటలు ఎక్కడ? సిరిసంపదలెక్కడ? అందుకే మనిషి కన్నా మీరే మిన్న అనే భావం వ్యక్తమవుతుంది. చెంగు చెంగున గంతులు వేయండి… జాతివన్నె బుజ్జాయిల్లారా నోరులేని తువ్వాయిల్లారా…అంటూ సాగే పాట వినసొంపుగా ఆలోచిం పజేసే విధంగా హాయిగాసాగి పోతుంది…ఈ చిత్రంలోనే రైతు మేడిబట్టి సాగాలెరా లోకం వాడిచుట్టూ తిరగాలిరా అంటూ సాగే మరో పాట అన్నదాతలకస్టాన్ని గుర్తుచేస్తుంది.

ఇంటికి దీపం ఇల్లాలే -1961
‘ఇంటికి దీపం ఇల్లాలే’ అనే సినిమా 1961లో సంక్రాంతికి విడుదలై అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రంలో మనసు కవి ఆత్రేయ కలం నుండి సంక్రాంతి పాట విలక్షణంగా జాలువారింది. పొంగి పొంగి వచ్చింది సంబరాల సంక్రాంతి… అంటూ పాటుబడి పండించే రైతులంతా పండుగ నాడు ప్రమాణాలు చేయాలి – అహ పాడుగుణ మొకటైనా విడవాలి అంటూ సాగే పాట యువతను సంక్రాంతి లోగిళ్లకు తీసుకువెళ్లింది. సంక్రాంతి సందడి కుర్ర కారు గుండెల్లో పందిళ్లు వేసింది. విందులారగించి చిందులు వేసింది.

బొబ్బిలియుద్ధం -1964
‘బొబ్బిలియుద్ధం’ చిత్రంలో జమునతో చిత్రీకరించిన ఆరుద్ర రాసిన ‘ముత్యాల చెమ్మచెక్క, రత్నాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా అంటూ సాగేపాట సంక్రాంతి సమయంలో కన్నె పిల్లల సందడని గుర్తు చేస్తుంది. బతుకుల్లో క్రాంతి నింపే సంక్రాంతి వేడుకల్లో భాగంగా తెలుగింటి ఆడపడుచుల ఆటపాటల్ని ఒకసారి కళ్లారా చూడాలనిపించే పాట ఇది.

ఉండమ్మా బొట్టుపెడతా- 1968
తెలుగు నాట అత్యంత ఆదరణ పొందిన సంక్రాంతి పాటల్లో తొలిస్థానం దక్కించుకున్న పాట ‘రావమ్మా మహలక్ష్మి రావమ్మా అంటూ సాగే పాట. ఈ పాట తెలుగువారిళ్లలో సంక్రాంతి తొలిపొద్దులో తెలితెమ్మెర మంచు పట్టిన వేళ కమ నీయంగా వినిపిస్తుంది. 1968లో విడుదలైన ‘ఉండమ్మా బొట్టుపెడతా’ సినిమాలోని ఈ పాట అఖిలాంధ్ర ప్రేక్ష కుల్ని ఆకట్టుకుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన సంక్రాంతి సినీ గీతాలకే మకుటాయమానం. ఈ పాట ఇప్పటికీ సంక్రాంతి శుభఘడియల్లో ఇంటింటా మారుమ్రోగుతుంది.

ముత్యాల ముగ్గు – 1975
బాపూ దర్శకత్వంలో ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో సంక్రాతిపై ప్రత్యేకంగా పాటలు లేకపోయినా…గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ, గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ, పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ ..ముంగిట వేసిన ముగ్గులు చూడు,ముత్యాల ముగ్గులు చూడు అంటూ సి నారాయణ రెడ్డి రాసిన పాటలో ఎక్కువ శాతం సంక్రాంతి ప్రతీకలు కనిపిస్తాయి. ‘ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ. ఆరనైదో తనం ఏ చోట నుండు, అరుగులలికే వారి అరచేత నుండు, తీరైన సంపద ఎవరింట నుండు, దినదినము ముగ్గున్న లోగిళ్ళనుండు. గోవు మాలక్ష్మికి కోటి దండాలు, కోరినంతా పాడి నిండు కడవల్లు, మొగుడు మెచ్చిన చాలు కాపురంలోన’ అంటూ ఆరుద్ర ‘ముత్యాలముగ్గు’ కోసం రాసిన పాటలో సంక్రాంతి వైభవాన్ని అపూర్వంగా దర్శింప చేసారు. ఈ రెండు పాటలు ముత్యాల ముగ్గు సినిమాలో ఆణిముత్యాల్లాంటి పాటలే.

పదహారేళ్ల వయసు – 1978
పంటచేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ అనే పాటను ‘పదహారేళ్ల వయసు’ సినిమాకి వేటూరి రాసారు. వాస్తవానికి ఈ పాటలో సంక్రాంతిని ఉద్దేశించి, పాడిన పాట కాకపోయినా, సంక్రాంతి పండగకు ప్రతీకలైన పాడి పంటలు …గుమ్మడిపూలు …కుప్పనూర్పిళ్ల అనే పదాలు సంక్రాంతి వేడుకను గర్తుకు తెస్తాయి. ఈ పాటను నోరారా ఆల పించని తెలుగు వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ‘పదహారేళ్ల వయసు ‘ సినిమా 1978లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టింది.

భోగిమంటలు -1981
తెలుగు దర్శకుల్లో సంక్రాంతి సినిమాలు ఎక్కువగా తీసిన దర్శకుడు పి.సి.రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన ‘భోగి మంటలు’ సినిమా 1981లో విడుదలైంది. ఈ చిత్రంలో బావామరదళ్ల ముచ్చట్లను సంక్రాతితో కలిపి, అలతి అలతి పదాలతో ఆత్రేయ పాటగా జాలువార్చాడు. భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో భోగిమంటల భోగుల్లో అంటూ బావల వీపుల తప్పట్లోయ్‌ కాగిన కొద్దీ చప్పట్లోయ్‌- మోగిన కొద్దీ ముచ్చట్లోయ్‌ అంటూ తెలుగింటి బావమరదళ్ల సరసాలను చక్కగా వండి వార్చారు. ఆ రోజుల్లో ఈ పాట విని ఆనందించని, తెలుగోడు లేడంటే అతిశయోక్తి కాదు… ఇప్పిటికీ ఈ పాట సంక్రాంతి జాతరల్లో మారు మ్రోగుతుంది.

ఊరంతా సంక్రాంతి – 1983
దర్శక రత్న దాసరి దర్శకత్వం వహించిన ‘ఊరంతా సంక్రాంతి’ సినిమా 1983లో విడులైంది. ఈ చిత్రానికి దాసరే సమ కూర్చిన పాట కూడా పెద్ద పండుగకు పెద్ద హిట్ కొట్టేసింది. ‘సంబరాల సంకురాతిరికి ఊరంతా పిలిచి, ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతుల గొబ్బెళ్లు పెట్టే కన్నెలపిల్ల సందళ్లు పల్లెల్లో కళ్లారా చూడాల్సిందే. ఈ సినిమాలో ఏడాదికో పండగ బ్రతుకంతా తొలి పండుగ’ అంటూ సాగే ఈ పాట చిత్రంలో హైలెట్ గా నిలిచింది. సంక్రాంతి సంబరాలను పూర్తి స్ధాయిలో ఆవిష్కరించింది.

ముగ్గురు మిత్రులు – 1985
రాజా చంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘ముగ్గురు మిత్రులు’ సినిమా 1985లో విడుదలైంది. ఈ చిత్రంలో వేటూరి కలం నుంచి జాలువారిన పాటల్లో ‘సంబరాలు సంబరాలు సంకురాత్రి అంటూ సాగే పాట సంక్రాంతి కళను కళ్లకు కట్టింది. ఇంటింటి సంక్రాంతి అందాలకు ఆనందాలకు వేదికైంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో జరుపుకునే సంక్రాంతి పండుగ గుళ్లో తీర్థం అంతా చల్లగా .. భోగి మంటలంతా వెచ్చగా ఉంటుంది…ఆ అద్వితీయ అనుభూతిని రమణీయంగా పంచిందీ పాట… గుళ్లో గంటల, సంగీతానికి మా లక్ష్మి తరలి వస్తుంటే మాగాణి చేలల్లో పేరంటాలు ఆహ్వానం పలికాయి.

వారసుడొచ్చాడు – 1988
మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన ‘వారసుడొచ్చాడు’ సినిమా 1988లో విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసు కుంది. ఈ చిత్రంలో జాలాది జానపద సరళిలో ఒక పాటరాసారు. అసలు జాలాది అంటేనే జానపదాల బాణి అంటారు .పాటతోనే సినిమాకు ప్రాణం పోసిన గేయ రచయితల్లో ఆయన ఒకరు. అలాంటి జాలాది కలం నుండి జాలువారిన సంక్రాంతి పాట పల్లెలను ఒక ఊపు ఊపింది. యాలాద్రి వెంకన్న ఏలదాటి రావన్నా సంక్రాంతి వేడుకొచ్చిందో అనే పాట లో అచ్చమైన పల్లె పదాలు పొదిగారు జాలాది. ఆ పాట విన్నంత సేపు మనసు విప్పి మాట్లాడే పల్లెతనం గుర్తుకొస్తుంది. ఆ పాట సంగీత ప్రియుల్ని ఆసాంతం అలరించింది. గుండె గుండెలో పాట పాల కుండలా పొంగి పొర్లింది. పల్లె ఎద లో వెల్లువెత్తింది.

సూత్రధారులు – 1989
తెలుగు నాట వచ్చే పండగలన్నీ ఆధ్యాత్మిక కథల నేపథ్యంలో ఉంటాయి. ఒక్క సంక్రాంతి పండుగ మాత్రం ఖగోళానికి సంబంధించిన పర్వంగా ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవునా జీవరాశికి చైతన్యాన్ని నింపే ఆదిత్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఇది మకర సంక్రాంతి అయ్యింది. వాస్తవానికి ఈ రోజు నుంచి పుణ్యతిథులకు ఆలవాలమైన ఉత్తరాయణంలోకి అడుగు పెట్టే కాలం. పాడిపంటలు ఇళ్లకు చేరేందుకు అనువైన కాలం. ఈ నేపథ్యంలో సృష్టి స్థితి లయలకు కారకులైన హరిహరులకు సేవలు అందించే హరిదాసుల భజన గీతాలతో గంగిరెడ్లవారి సన్నాయి మేళా లలో సంక్రాంతి పర్వానికి నిండుదనం వస్తుంది. జీవితాలు పాడిపంటలతో నిండు వర్థిల్లే పల్లెసీమ సంస్కృతికి అద్దం పట్టే ‘సూత్రధారులు’ సినిమా పాట కమనీయంగా సాగుతుంది. ఈ సినిమా 1989లో విడుదలై అద్భత విజయాన్ని సొంతం చేసుకుంది. మహారాజ రాజశ్రీ మహనీలయులందరికీ వందనాలు వంద వందనాలు..

సోగ్గాడి పెళ్ళాం – 1996
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడి పెళ్ళాం’ సినిమాలో 1996 చిత్రంలో భువనచంద్ర రాసిన ‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా… కొత్త ధాన్యాలతో కోడి పందాలతో, ఊరే ఉప్పొంగుతుంటే ఇంటిం టా.. అంటూ సాగే పాట పల్లెల నిర్మలత్వానికి అద్దం పట్టింది. సంకురాత్రి సంబురాలను కళ్లకు కట్టింది. ఊరు ఊరంతా పాడిపంటలతో… కొత్తబట్టలతో… పిండివంటలతో సంతోషాల జీవనదిగా ఉప్పొంగుతుంది. రండి సరదాల సంక్రాంతి పాటకి స్వాగతం పలుకుదాం.

రాముడొచ్చాడు – 1996
దర్శకుడు కోదండరామిరెడ్డి డైరెక్ట్‌ చేసిన ‘రాముడొచ్చాడు’ సినిమా 1996లో విడుదలైంది. ఈ చిత్రంలో వేటూరి మరో సారి అద్బుతంగా.. మా పల్లె రేపల్లంట – ఈ పిల్లే రాధమ్మంట రేగుతుంటె భోగిమంట – రేగు పళ్ల విందులంట అంటూ సాగే పాట కుర్రకారును ఊపేసింది. ప్రణయ ఊహలతో ఊసులాడే బావామరదళ్ల ఉల్లాసానికి సంకురాత్రి వేదికైంది. గొబ్బెళ్లు పెట్టే పల్లె గోపెమ్మలకు పాట హుషారు తెచ్చింది. సంకురాత్రి తిరునాళ్ళలో పల్లె పచ్చగా పిల్ల వెచ్చగా వుండే పండగ అంటూ వేటూరి రాసిన పాట మరింత చిలిపితనం చిలకరించింది.

సింధూరం -1997
కృష్ణ వంశీ దర్శకత్వంలో విడుదలైన ‘సింధూరం’ సినిమా నాటి యువతను ఆలోచింపజేసింది. ఈ సినిమాలో సిరివె న్నెల రాసిన పాటలో సంక్రాంతి సొబగులను సరికొత్తగా ఆవిష్కరించారు. పల్లె సంక్రాంతి నిండు పున్నమిలా శోభిల్లింది. పడుచు పిల్లల అల్లరి… పెద్దవాళ్ల సందడి వెరసి సంక్రాంతికి నవ్య అందాలను అద్దింది. 1997లో రిలీజ్ ఈ సినిమా పెద్దగా లాభాలు తెచ్చిపెట్టకు పోయినా సంక్రాంతి వనవధువు నుదుట సిందూరంలా భాసిల్లింది. ఏడు మల్లెలెత్తు ఉన్న సుకుమారికి ఎంత కష్టం వచ్చింది నాయనో….అంటూ సాగే పాట అరమరికలు లేని పల్లె అందాలను పాల పాయశంలా వండి వార్చారు..

పండగ – 1990
శరత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పండగ’ చిత్రం కోసం చంద్రబోస్‌ రాసిన పాటలో కూడా సంక్రాంతి ప్రస్దావన ఉంది. ‘ముద్ద బంతులు మువ్వమోతలు నట్టింటి కాలుపెట్టు పాడిపంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు అంటూ సాగే పాట 1990లో ఒక తరాన్ని మంత్రముగ్దుల్ని చేసింది.’ ఈ పాట రిలీజైన కొత్తలో తెలుగు ప్రాంతాల్లో అంతటా మారుమ్రోగింది. జూనియర్ వేటూరిగా చంద్రబోస్ పాట ఆబాలగోపాలన్ని మంత్రముగ్దం చేసింది.

సంక్రాంతి – 2005
‘సంక్రాంతి’ టైటిల్ గా 2౦౦5 లో విడుదలైన చిత్రంలో కూడా ఆ సంబరాలకు సంబంధించిన పూర్తి నిడివి పాటలేదు. కుటుంబ సభ్యుల మమతాను రాగాలను చాటే పాటలో ఒక చరణంలో మాత్రం సంక్రాంతి చోటు చేసుకొంది. ఇ.యస్‌. మూర్తి ఈ బృంద గీతాన్ని రాశారు. ఆనందాలె వెల్లువైతే కళ్లలోన అనురాగాలె నిండిపోవా అంటూ సాగిపోతుందీ పాట. ఇంటిల్లపాది ఆడిపాడే సంక్రాంతి వేడుకలో కమనీయమైన ఆపాటతో వీనుల విందు చేద్దాం.

ఝుమ్మంది నాదం – 2010
తెలుగు వారి జీవన సంస్కృతిలో సంక్రాంతి పండుగ తలమానికమైంది. సస్యశ్యామలమైన పల్లె సీమల్లో హరిదాసులు పాటలు ..అందమైన రంగవల్లులు..గొబ్బెమ్మలతో ఊళ్లన్నీ ఆనంద డోలికల్లో తేలియాడుతుంటాయి. అలాంటి పల్లెల ను దృశ్యకావ్యంగా ఆవిష్కరించిన చిత్రం ‘ఝుమ్మంది నాదం’. 2010లో విడుదలైన ఈ సినిమాలో భోగిపళ్ళు పోసుకుని బంతిపూలు పెట్టుకుని అంటూ సాగే పాట కుర్రకారును హూషారెత్తిస్తుంది.

మంచి రోజులొచ్చాయి -1972
ఈ సంక్రాంతి నుండి మనందరికీ మంచి రోజులు రావాలని మనసారా కోరుకుందాం…మర్చిపోయానండోయ్ ఈ సంక్రాం తి పండగ సందర్భంగా…సినీ సంక్రాంతిలో చివరిగా ‘మంచిరోజులొచ్చాయి’ సినిమాలో పాటగురించి చెప్పుకోవాల్పిందే. ఈ సినిమా 1972లో విడుదలైనా …మంచి రోజులొచ్చాయి అనే పదాలు మాత్రం నిత్య నూతనాలే. కోట్లాది ప్రజలు ఆ మంచి రోజుల కోసమేగా ఎదురు చూసేది. కర్షకుల శ్రమైక జీవన సౌందర్యాన్ని అక్షరాక్షరంలో చేర్చి. కమనీయంగా చైత న్యదీప్తులను వెదజల్లిన పాట ఇది. ఈ నాటి సంక్రాంతి అసలైన పండగ .. సిసలైన పండగ అంటూ సాగే పాట అన్నదాత లను… రైతు శ్రామికులను ….రైతుకూలీలను సమ్మోహన పరిచిన పాట. వాస్తవానికి ఈ పాట ఆబాలగోపాలాన్ని అలరించింది.

మూడు రోజులపాటు అంగరంగ వైభంగా సాగే సంక్రాంతి పర్వం అచ్చమైన తెలుగింటి పండగగా…రైతుల పండగగా …పుణ్యతిథుల పండగగా …అలరారుతోంది. ఈ నేపథ్యంలో ఇలా తెలుగు సినిమా పాటల్లో సంక్రాంతి అప్పుడప్పుడూ తొంగి చూస్తే తెలుగు జాతికి గత వైభవాన్ని గుర్తు చేస్తూ ఉత్సాహపరుస్తూనే ఉంటుంది. ఈ విధంగా ప్రతీ సంక్రాంతికి పండగను ప్రతిబింబించే మంచి మంచి సినిమాలు … వీనుల విందైన మరిన్ని సినీ గీతాలు రావాలని, తరతరాలకు సంక్రాంతి క్రాంతి..సినీ సంక్రాంతిగా వెల్లివిరియాలని సినిమా అభిమానులందరం కోరుకుందాం.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్