ముప్పవరపు వెంకయ్య నాయుడు…అచ్చమైన తెలుగింటి రైతు బిడ్డ. మట్టి పరిమళం వెదజల్లే జాతీయ నాయకు డు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఒక సాధారణ పల్లెటూరిలో జన్మించిన వెంకయ్య తన అసాధారణ ప్రతిభతో యావత్ భారతదేశంలో గుర్తింపు తెచ్చుకున్నారు. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉప రాష్ట్రపతి వంటి అత్యున్న త పదవి చేపట్టారు. చేపట్టడమే కాదు….తన పనితీరుతో ఉప రాష్ట్రపతి పదవికే వెన్నె తీసుకువచ్చారు వెంకయ్య నాయుడు.1949 జులై ఒకటోతేదీన నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. బుచ్చిరెడ్డిపాలెం జడ్పీ హైస్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత నెల్లూరు వీఆర్ కాలేజీలో డిగ్రీ చదివారు. అట్నుంచి న్యాయశాస్త్రం చదవడానికి విశాఖ ఆంధ్రా యూనివర్శిటీకి వెళ్లారు. ఆంధ్రా యూనివర్శిటీలో చదువుతుండగా, విద్యార్థి సంఘ నేతగా గుర్తింపు పొందారు. వెంకయ్య నాయడుకు మొదట్నుంచి ఏబీవీపీతో అను బంధం ఉంది.
ఆ తరువాత 70ల నాటి జై ఆంధ్రా ఉద్యమంలో కూడా వెంకయ్య నాయుడు చురుకుగా పాల్గొన్నారు. ఇందిర విధించిన ఎమర్జెన్సీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినందుకు అప్పటి ఇందిర ప్రభుత్వం వెంకయ్య నాయుడును కొంతకాలం జైల్లో పెట్టింది. 1978లో అప్పటి జనతా పార్టీ టికెట్‌పై వెంకయ్య నాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆ తరువాత రాజకీయంగా వెంకయ్య వెనుదిరిగి చూసుకోలేదు. జాతీయస్థాయి రాజకీయాలకు ఎదిగారు.కర్ణాటక నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున అనేకసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్లో కొంతకాలం గ్రామీణాభివృద్ది శాఖా మంత్రిగా పనిచేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు రహదారి సౌకర్యం కల్పించడంలో కీలకపాత్ర పోషించారు. అలాగే కేంద్ర పట్టణాభివృద్ది శాఖామంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎనలేని సేవలు అందించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, కాకినాడ నగరాలను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చారు. అంతేకాదు ..ఆయా నగరాల్లో మౌలిక వసతుల మెరుగుదల కోసం భారీ ఎత్తున నిధులు విడుదల చేయించారు.
2017లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉప రాష్ట్రపతి పదవి చేపట్టారు వెంకయ్య నాయుడు. 2022 వరకు ఉప రాష్ట్రప తిగా ఆయన పనిచేశారు. ఉప రాష్ట్రపతిగా రాజ్యసభను సజావుగా నడిపించి పార్టీలకతీతంగా అందరి అభిమానాన్ని పొందారు. 2019 ఆగస్టు ఐదో తేదీన రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ ఏ ఒక్క విపక్ష సభ్యుడినీ వెంకయ్య నాయుడు బయటకు పంపలేదు. అత్యంత చాకచక్యంగా సభను నిర్వహించారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు ను సజావుగా సభలో పాస్ చేయించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడి నేర్పరితనం అందరినీ ఆకట్టుకుంది. మూడు భాషల్లో అద్భుతంగా ప్రసంగించే చాతుర్యం వెంకయ్య నాయుడి స్వంతం. తెలుగు మీడియం లో చదువుకున్నప్పటికీ, స్వయంకృషితో హిందీ, ఇంగ్లీష్ భాషలపై సాధికారత సంపాదించారు ఆయన. వెంకయ్య నాయుడు ప్రసంగాలంటే…అలా ఇలా కాదు…అంత్య ప్రాసలుంటాయి. సునిశితమైన హాస్యం ఉంటుంది. చమక్కులు ఉంటాయి. మెరుపులూ ఉంటాయి.
దక్షిణాది నుంచి వచ్చినా, ఉత్తరాదిలోనూ సత్తాగల నాయకుడిగా వెంకయ్య నాయుడు గుర్తింపు పొందారు. ఉత్తరాది నాయకులతో సరిసమానంగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉండ టం వెంకయ్య నాయుడు లక్షణం. గ్రామీణ వేష, భాషలను వెంకయ్య నాయుడు ఎన్నడూ వీడలేదు. ఈ లక్షణమే జాతీయ రాజకీయాల్లో వెంకయ్య నాయుడుకు విశిష్ట వ్యక్తిగా గుర్తింపు తీసుకువచ్చాయి. వెంకయ్య నాయుడుకు వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడితోనూ విభేదాలు లేవు. సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప వ్యక్తిగత పొరపచ్చాలు లేని ఆజాత శత్రువు వెంకయ్య నాయుడు. విద్యార్థి రాజకీయాల నుంచి ఉప రాష్ట్రపతి పదవి వరకు నాలుగు దశాబ్దాలకు పైగా దేశ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది వెంకయ్య నాయుడును పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. అసమాన వాగ్దాటితో, ఆసేతు హిమాచలం జనం అభిమానాన్ని స్వంతం చేసుకున్న అరుదైన తెలుగు నేత ముప్పవరపు వెంకయ్య నాయడు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగువారి ఠీవి…ముప్పవరపు వెంకయ్య నాయుడు.


