ఈ సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవా .. అంటే అవుననే అనవచ్చు…. తెలం గాణ ఆర్టీసీ ప్రకటించిన నామ మాత్రపు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సరిపోతాయా..? తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. అధిక సంఖ్య లో పెరిగిన ప్రయాణీకులకు అనుగుణంగా ఆర్టీసీ ఎందుకని తగిన ఏర్పాట్లు చేయలేదు. ఫ్రీ బస్ సర్వీస్ లేనప్పు డే ఆర్టీసీ బస్సుల్లో గత ఏడాది సంక్రాంతికి కోటి 21 లక్షల మంది ప్రయాణం చేశారు. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం, టీఎస్ఆర్టీసీ ఎందుకని ముందస్తు జాగ్రత్తల మీద ప్రత్యేక శ్రద్ద చూపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ సంక్రాంతి. పట్నం మొత్తం పల్లె బాట పట్టిందేనటట్లుగా ప్రజలు తమ సొంత ఊళ్లకు తరలివెళ్తారు. ఇక ఇప్పటికే ఈ నెల 12 నుంచి 17 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో మరో మూడు నాలుగు రోజుల నుంచి అన్ని ప్రధాన బస్టాండ్‌లో ప్రయాణీకుల రద్దీ మొదలయ్యే అవకాశం ఉంది.
సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల, వరంగల్, విజయవాడ, కాకినాడ , ఒంగోలు, నెల్లూరు , రాజమండ్రి, ఇతర ప్రాంతాలకు ప్రజలు ఎక్కువగా వెళ్తారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్ , ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్ బీ నగర్, కేపీహెచ్‌బి, ఆరాంఘర్, గచ్చీబౌలీ ప్రాంతాల నుంచి సంక్రాంతి ప్రత్యేక బస్సులు బయలు నడుస్తాయి. తెలంగాణలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత రోజుకి దాదాపు 55 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మరీ వచ్చే సంక్రాంతి పండుగకు రోజు వారి ప్రయాణీకులతో పాటు సొంత ఊళ్లకు వెళ్లే వారి ప్రయాణీకుల రద్దీ మరింత ఎక్కువ అవుతుంది.
గతేడాది సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ బస్సులు తిప్పిన టీఎస్ఆర్టీసీ ఈ సారి తగ్గించి ఇక్కడి రద్దీకి అనుగు ణంగా బస్సులు తిప్పుతామని అంటోంది. అయితే పొరుగు రాష్ట్రాలకు ఎక్కువగా సూపర్ లగ్జరీ , డీలక్స్ , రాజధాని, లహరి , గరుడ బస్సులను తిప్పే ఆర్టీసీ.. ఇప్పుడు వాటిని తెలంగాణలో నడిపి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తామంటోంది. కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత బస్సుల్లో రోజుకి 27 లక్షల మహిళా ప్రయాణీకులే ఉంటున్నారు. సూపర్ లగ్జరీ , డీలక్స్ బస్సులు అందుబాటులో పెట్టినప్పటికీ పేద మధ్యతరగతి ప్రజలు పల్లె వెలుగు , ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. వీటికి తోడు గతేడాది సంక్రాంతికి సాధారణ ఛార్జీలే వసూల్ చేసిన ఆర్టీసీ.. ఈ సారి రద్దీకి అనుగుణంగా డైనమిక్ ప్రైస్ ను అమలు చేస్తుంది. దీంతో సాధారణ రోజుల్లో ఉండే టికెట్ రేట్ల తో పోలిస్తే కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులు చార్జీలను దృష్టిలో పెట్టుకొని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల వైపు మళ్లితే బస్ స్టాపుల్లో పడిగాపులు, బస్సుల్లో సీట్లు దొరక్క పడే ఇబ్బందులు ఎదురవుతాయి.
వాస్తవానికి గత పదేళ్లలో పెరిగిన ప్రజలకు తగ్గట్టు గత ప్రభుత్వం ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సుల కొనుగోలు మీద దృష్టి పెట్టలేదు. 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి 12 వేలకు పైగా బస్సులుంటే.. ఇప్పుడు 9వేల 600 మాత్రమే ఉన్నా యి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బస్సుల మీద దృష్టి పెట్టడంతో సంక్రాంతి పండగకు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాల్సిన అవసరం ఉంది.