ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. మూడు స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం వుంది. మరోవైపు టీడీపీ కూడా రాజ్యసభ బరిలో నిలిచే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ పై ధీమాతో టీడీపీ రాజ్యసభ ఎన్నికలకు రెడీ అయితే ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం వుంది. అయితే వైసీపీ మాత్రం రాజ్యసభ ఎన్నికల్లో విజయం తమదే అనే ధీమా తో వుంది. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ సామాజిక, ప్రాంతీయ సమీకర ణాల కు ప్రాధాన్యం ఇవ్వనుంది.
ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ వెలువడ నుంది. ఫిబ్రవరి 27 న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీ లో బలా బలాల ప్రకారం అధికార వైసీపీ మూడు రాజ్యసభ స్థానాలు దక్కించుకునే అవకాశం వుంది. అయితే ప్రతిపక్ష టీడీపీ కూడా రాజ్యసభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం వుంది. ఒక్క రాజ్యసభ సీటు గెలవాలంటే…44 మంది ఎమ్మెల్యేలు ఓట్లు కావాలి. సంఖ్యా పరంగా చూస్తే వైసీపీ కి మూడు స్థానాలు దక్కుతాయి. గత ఎన్నికల్లో వైసీపీ 151స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, అనం రామ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి వైసీపీ కి గుడ్ బై చెప్పి, టీడీపీ లో చేరారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణా రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏపీ అసెంబ్లిలో ప్రస్తుతం వైసీపీకి వున్న సంఖ్యాబలం ప్రకారం ఆ పార్టీ మూడు రాజ్యసభ స్థానాలు గెలుచుకునే అవకాశాలే ఎక్కువ. ఇటీవల రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుల, చేర్పులు చేస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యే లకు అధికార వైసీపీ టికెట్ నిరాకరించింది. దీంతో కొందరు ప్రతి పక్ష టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఒక వేళ టిడిపి రాజ్యసభ ఎన్ని కల బరిలో దిగితే వైసీపీ లోని అసంతృప్తి ఎమ్మెల్యే లు టీడీపీకి క్రాస్ ఓటింగ్ వేసే అవకాశం వుంది. గతంలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి కి అనుకూలంగా ఓటు వేశారు. వైసీపీ కి సంఖ్యా బలం వున్నా…టీడీపీ ఒక ఎమ్మెల్సీని గెలుచుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు వచ్చే అవకాశం వుందని టీడీపీ భావిస్తుంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు కేవలం రెండు నెలలే ఉన్న నేపథ్యంలో టిడిపి రాజ్యసభ బరిలో నిలిచే ప్రయత్నం చేస్తుందా? లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో సామాజిక, ప్రాంతీయ సమీకరణలకు ప్రాధాన్యం ఇస్తున్నా రు. ఎమ్మెల్యే ల మార్పులు , చేర్పులలో భాగంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల కు సీఎం జగన్ టికెట్ ఇవ్వలేదు. అందులో ఇద్దరు ఎమ్మెల్యే లకు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రాజ్యసభ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఈ సారి ఎస్సీ, రెడ్డి, బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లా నేతలను రాజ్యసభ పంపే యోచనలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబు రావు కి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదు.దీంతో ఆయన కు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాగే పార్టీలో.సీనియర్ నేత, వైవీ సుబ్బారెడ్డి కి రాజ్యసభ సీటు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. మూడు స్థానాలకు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబు రావు, ఆరని శ్రీనివాస్ లు ఎంపికయ్యే అవకాశం ఉంది.
రాయలసీమ జిల్లాల నుంచి చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్ పేరు రాజ్యసభ రేసులో ప్రధానంగా వినిపిస్తుంది. చిత్తూరు నుంచి గత ఎన్నికల్లో అయన వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ స్థానం నుంచి విజయా నంద రెడ్డి పేరు ప్రకటించింది వైసీపీ. దీంతో రాజ్యసభ సీటు ఇస్తానని సీఎం జగన్, శ్రీనివాస్ కు హామీ ఇచ్చారు. రాయలసీమ జిల్లాలో బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఆ ఓట్లు తమ వైపు తిప్పుకునే అవకాశం వుంటుందని జగన్ భావిస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా వైసీపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దిగి క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహిస్తుందా.. లేక ఎన్నికలు సజావుగా జరిగేందుకు వీలుగా పోటీకి దూరంగా ఉంటుందా. అన్నది సస్పెన్స్. టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.


