దేవుడు ఎక్కడి నుంచో దిగిరాడు. మానవరూపంలోనే ఉంటూ, మహిమాన్వితుడై నమ్మినవారిని కరుణిస్తాడు. అందువల్లనే ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహా విష్ణువు, మానవ రూపంలో యుగయుగాన అవతరించాడు. శ్రీ మహా విష్ణువు త్రేతాయుగాన శ్రీరాముడిగా మానవరూపంలో జన్మించాడు. అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిం చాడు. ప్రజలకు మంచి పరిపాలన అందించాడు. అందుకే రామరాజ్యం ఓ ఆదర్శం అయింది. రామచంద్ర ప్రభువు సకల గుణాభిరాముడు. శ్రీరాముడి సుగుణాలు సమస్త మానావాళికి ఎప్పటికీ ఆదర్శమే.దీనికి కాలంతో పనిలేదు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నల అనుబంధం అన్నదమ్ముల అనురాగానికి ప్రతీకగా నిలిచింది. తన మాటను జవదాటని తమ్ములకు ఒక అన్నగా రాములవారు నిలిచారంటే, ఆయన వారిపై ఎంతటి అవ్యాజమైన ప్రేమను చూపించాడో అర్థం చేసుకోవచ్చు.
శ్రీరాముడు వనవాసానికి వెళ్లినప్పుడు, ఆయన వెంట అయోధ్యవాసులు కూడా బయల్దేరారు. దీనిని బట్టి శ్రీరామ చంద్రుడి గుణగణాలు ఎంతటి మహోన్నతమైనవో అర్థం చేసుకోవచ్చు.అంతటి గుణవంతుడు కనుకనే, రామచంద్ర ప్రభువు దేవుడయ్యాడు. శ్రీరాముడు స్వభావరీత్యా సాధు పంగవుడు. అయితే ఒకసారి యుద్ధరంగంలో అడుగుపెడితే శత్రుమూకలపై అరివీర భయంకరంగా చెలరేగిపోయేవారు. అంతేకాదు..ధర్మానికి రామచంద్రులవారు నిలువెత్త ప్రతీక. ధర్మం కోసం ఆయన యుద్దరంగంలో దిగితే ఎంతటి వీరులైనా నేలకొరగాల్సిందే. తండ్రి మాట కోసం మారుమాట మాట్లాడకుండా అరణ్యవాసానికి బయల్దేరిన పితృవాక్య పరిపాలకుడు రామచంద్ర ప్రభువు. భరతుడు తిరిగి వచ్చి రాజ్యానికి రమ్మని కోరితే, అతడిని వారించి పరిపాలనా విధులు నేర్పి పంపి భాతృ ధర్మము నిలిపాడు. సుగ్రీవునికి రాజ్యం అప్పగించి స్నేహధర్మం చాటుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఇలా శిష్యధర్మం, జీవ ధర్మం ఆచరించి ధర్మాత్ముడ య్యాడు. అందుకే శ్రీరాముడు దేవుడయ్యాడు. రామచంద్ర ప్రభువు తన జీవితకాలమంతా సత్యాన్నే పలికాడు. సర్వకాల సర్వావస్థలందు సత్యాన్నే మాట్లాడిన ధీరోదాత్తుడు ఆయన. ప్రజల మాటనే తన బాటగా చేసుకున్న ప్రజారంజక పాలకుడు రామచంద్రుడు. మనసులో అనుకున్న మాటనే రాములవారు పైకి పలికేవాడు. అలా పలికిన మాటనే ఆచరించిన సత్యవాక్కు పరిపాలకుడు ఆయన. అందుకనే శ్రీరాముడు, దేవుడయ్యాడు.
పితృవాక్య పరిపాలన కోసం రామచంద్ర ప్రభువు, అరణ్యవాసానికి వెళ్లాడు. ఈ అరణ్య వాసంలో రామచంద్ర ప్రభు వు అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. అరణ్యవాసంలో ఉన్నప్పుడే సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించాడు. అయినప్పటికీ రామచంద్ర ప్రభువు, అయోధ్య వైపు తిరిగి చూడలేదు. భరతుడి సాయం కోరలేదు. మహోగ్రమైన సమరంలో లంకాధీశుడు రావణాసురుడిని రామచంద్రుడు సంహరించాడు. అంతటి దృఢ సంకల్పుడు కాబట్టే శ్రీరామచంద్రుడు దేవుడయ్యాడు.
శ్రీరాముడు మానవరూపంలో ఉండి, వానరులతో స్నేహం చేశాడు. పశు పక్ష్యాదులతో సైతం సంభాషించాడు. సముద్రంపై వారథిని నిర్మించాడు. హనుమంతుడి పరాక్రమాన్ని గుర్తించి, తన భక్తుడిగా చేసుకున్నాడు. ఆంజనే యుడితో అనేక మహత్తర కార్యాలు చేయించాడు. అన్నివిధాల శ్రీరాముడు తన సమర్థతను నిరూపించుకున్నాడు. అందుకనే రామచంద్ర ప్రభువు దేవుడయ్యాడు. అయోధ్యను రాజధానిగా చేసుకుని శ్రీరామచంద్రుడు ప్రజారంజక పాలన అందించాడు. ప్రపంచం అంతా ఆయనను సూర్యవంశ క్షత్రియ మానవునిగానే భావించింది. అయితే రామచంద్రుడు దినదిన ప్రవర్థమానుడయ్యాడు. అపూర్వమైన తన గుణగణాలతో సర్వజన మన్ననలు పొందాడు. అందుకే…శ్రీరాముడు దేవుడయ్యాడు. శ్రీరాముని దివ్య చరితము అజరామరం. సర్వగుణాభిరాముని కీర్తనం కలియు గాన ముక్తిదాయకం.