అయోధ్య రామమందిరంపై లోక్‌సభలో స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. రామమందిర ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతోందన్నారు. రాముడు ఒక మతానికే చెందిన దేవుడు కాదని.. ప్రజలు ఎలా జీవించాలో చేసి చూపించిన ఆదర్శ పురుషుడు రాముడని చెప్పారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా భక్తి ఉద్యమాన్ని నడిపించారని, కానీ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయం చేయలేదని అమిత్ షా తెలిపారు. రాముడు లేని భారతదేశాన్ని ఊహించుకునే వారికి దేశం గురించి పూర్తిగా తెలియదన్నారు. మోదీ ఆధ్వర్యంలో 330 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించామని.. రామ మందిర నిర్మాణంలో అందరం ఐక్యమత్యంగా వ్యవహరించామని తెలిపారు. మరో వైపు అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ పాల్గొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతను పార్లమెంట్ ఖండించిందని ఆయన గుర్తు చేశారు. తాను బాబర్, జిన్నా, ఔరంగజేబుకు ప్రతినిధిని కాదని..రాముడిని గౌరవిస్తానని చెప్పారు. ఈ దేశానికి మతం లేదని నమ్ముతున్నానని.. కానీ జనవరి 22 ద్వారా బీజేపీ ప్రభుత్వం ఒక మతంపై మరొక మతం గెలిచిందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటోందా అని ఒవైసీ ప్రశ్నించారు.