దేశ రాజధాని సమీపంలో మరోసారి కదం తొక్కారు అన్నదాతలు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూప కల్పన, 2020 నాటి ఆందోళనల్లో భాగంగా ప్రభుత్వం పెట్టిన కేసుల కొట్టివేయడం, పంట రుణాల మాఫీ సహా పలు డిమాండ్లతో హస్తినకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో.. ఎక్కడికక్కడ ప్రభుత్వం కర్షకులను అడ్డుకుంటోంది. ఢిల్లీ అంతటా నెలరోజుల పాటు 144 సెక్షన్ విధించింది. అదే సమయంలో హంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించింది. అయితే… తమ డిమాండ్లు తీర్చే వరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని తేల్చిచెబుతున్నాయి రైతు సంఘాలు. రాజధాని ఢిల్లీలోకి అనుమతించకుంటే సరిహద్దుల్లోనే ఉంటామని అంటు న్నారు. అంతేకాదు.. ఆరు నెలలకు సరిపడా ఆహార పదార్థాలు తమ వద్ద ఉన్నాయని చెబుతూ.. సర్కారుకు గట్టి వార్నింగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది.. ? అసలు అన్నదాతల డిమాండ్లేమిటి ?
యావత్ భారతం నలమూల నుంచి రైతన్నలు భారీగా తరలి రావడంతో ఢిల్లీ సరిహద్దులు అన్నదాతల నినాదాలతో మార్మోగిపోతున్నాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో ముందు గా నిర్ణయించిన ప్రకారం ఢిల్లీ ఛలో పేరుతో భారీ స్థాయి ఆందోళన మొదలు పెట్టారు అన్నదాతలు. ఇందులో భాగంగా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ సహా పలు చోట్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఎక్కడికక్కడ ట్రాక్టర్లు, రైళ్లలో వేలాదిగా తరలివస్తున్న వారిని అడ్డుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వీరంతా ఢిల్లీలోకి రాకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక, సంభూ సరిహద్దులో రైతులను అడ్డుకునే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆందోళన కారులను వెనక్కు వెళ్లాల్సిందిగా కోరారు. అయినా వెనక్కు తగ్గకపోవడంతో అప్రమత్తమైన ఖాకీలు.. రైతులపై డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో చెల్లాచెదురైన అన్నదాతలు అంబాలా హైవే పైకి చేరుకున్నారు. అయితే.. ఎవరెన్ని చేసినా తగ్గేదే లేదంటోంది కర్షక లోకం. తమ వద్ద ఆరు నెలలకు సరిపడా ఆహార పదార్థాలున్నాయని.. ఢిల్లీలోకి రానివ్వకుంటే సరిహద్దుల వద్దే ఇలా నిరసన చేస్తామంటున్నారు అన్నదాతలు.
ప్రస్తుతం రైతన్నల ప్రధాన డిమాండ్లేమిటి ? గతంలో పెద్ద ఎత్తున వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడిన కర్షక లోకం మళ్లీ ఎందుకు ఆందోళనకు దిగింది అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే… ప్రస్తుతం రైతుల ప్రధాన డిమాండ్ల విషయానికి వస్తే… పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం చేయడం అన్నది ముఖ్యమైనది. దీంతోపాటు రైతులకు పంట రుణమాఫీ అమలు, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, 2020 విద్యుత్ సవరణ చట్టం ద్వారా వచ్చే ఒప్పందాలు రద్దు చేయడం, అదే ఏడాది అన్నదాతలు ఆందోళన చేసిన సమయంలో నమోదైన కేసులను వెంటనే విత్ డ్రా చేయడం, ఉత్తరప్రదేశ్ లఖిమ్ పూర్ ఖేరి మృతులకు పరిహారం ఇవ్వడం అన్న ప్రధాన డిమాండ్ల విన్పించారు. దీనిపై కేంద్రం కూడా వారితో చర్చించింది. కేంద్రమంత్రులు పియూష్ గోయల్, అర్జున్ ముండా నేతృత్వంలోని ప్రభుత్వ బృందం… రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్‌కేఎం నేత జగ్జీత్‌సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘ్‌కు చెందిన సర్వన్ సింగ్ పంధేర్ సహా మరికొందరితో చర్చలు జరిపారు. అయితే… 2020-21 నాటి కేసుల ఉపసంహరణ సహా కొన్ని అంశాలకు కేంద్రం అంగీకరించినా కనీస మద్దతు ధరకు చట్టబద్దత విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో.. ఆందోళనకు దిగారు అన్నదాతలు.
ఇదే సందర్భంలో 2020 సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన అందరికీ గుర్తుకు వస్తోంది. అప్పట్లో అన్నదాతలు వాటిని వ్యతిరేకిస్తూ వేలాదిగా ఢిల్లీ వీధుల్లోకి వచ్చిన విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. గడ్డ కట్టించే చలిలోనూ మొక్కవోని దీక్షతో నిరసన చేపట్టిన రైతులు యావత్ దేశం దృష్టినీ ఆకర్షించారు. దీంతో దిగొచ్చిన మోడీ సర్కారు ఎట్టకేలకు వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే. ..పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయకపోవడం, స్వామినాథన్ సిఫార్సులు అమలు కాకపోవడం సహా మరికొన్నింటి విషయంలో పరిస్థితి ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న విమర్శల నేపథ్యంలో మళ్లీ ఆందోళనకు దిగారు రైతన్నలు.