అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం చిత్రం రోజురోజుకు రసవత్త రంగా మారుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోమారు అలక పాన్పు ఎక్కటంతో ఒక్కసా రిగా జిల్లా రాజకీయం కొత్తమలుపు తిరిగింది. అధిష్టానం అలక తీరుస్తుందా? పక్కకు తప్పిస్తుందా? అనేది ఆసక్తి కరం గా మారింది. బాలినేని దారెటు… జిల్లా లో వైసిపి పరిస్థితి ఏంటి… వలసనేతలతో నెట్టుకు వస్తారా? స్థానికులకు ప్రాధాన్యమిస్తారా? అనే విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రాజకీయాలకు అధిష్టానం ఏ విధంగా చెక్ పెడుతుంది? జగన్ బాలినేని వైపు ఉంటారా? లేక తన మాటను నెగ్గించుకుంటారా.. అనేఅంశంపై జిల్లా వైసీపీ భవితవ్యం ఆధారపడి ఉంది. జిల్లాలో నెలకొన్న ఈ ఆసక్తికర పరిస్థితిలకు ప్రధాన కారణమేంటి…. ప్రకాశం జిల్లా వైసీపీలో అసలేం జరుగుతుంది.
ప్రకాశం జిల్లా అధికార వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. 1999 నుండి వరుసగా ఒక ఉపఎన్నికతో కలిపి 6 సార్లు పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించిన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. రెండు సార్లు మంత్రిగా పనిచే శారు. 2014 ఎన్నికల్లో తన బావమరిది వైవి సుబ్బారెడ్డి ఎంపీగాను , బాలినేని ఎమ్మెల్యే గాను పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బాలినేని ఓటమి పాలయ్యారు. వైవి సుబ్బారెడ్డి విజయం సాధించారు. అప్పటివరకు సఖ్యంగా సాగిన బావ బామ్మర్దుల స్నేహబంధానికి గండి పడింది. జిల్లాలో అప్పటివరకు ఒంటి చేత్తో పెత్తనం చెలాయించిన బాలినేనికి వైవి చెక్ పెట్టారు. 2019 ఎన్నికల్లో బాలినేని పట్టుబట్టి మరీ మాగుంటను పార్టీలోకి తీసుకుని వచ్చి అతనికి ఎంపీ సీటు కట్టబె ట్టించారు. తిరిగి మంచి మెజారిటీతో బాలినేని విజయం సాధించి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. దీంతో మరో మారు బావా బావమరుదుల మధ్య వైరం తారాస్థాయికి చేరింది.
ప్రకాశం జిల్లాలో ని వైసిపి ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు, రెండు గ్రూపులుగా విడిపోయి తాడేపల్లికి ఫిర్యాదులతో క్యూ కట్టడం తో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన బాబాయి వైవి సుబ్బారెడ్డి వైపు మోగ్గారు. వై.వి మాట చెల్లుబాటు కావడం తో బాలినేని మంత్రి పదవి, జిల్లాల ఇన్చార్జి పదవులకు త్యాగం చేయక తప్పలేదు. జిల్లాలో తిరుగులేని నాయకుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ అవమానాన్ని సహించలేక పలుమార్లు అలకపూని పార్టీ కార్యక్రమాలకు దూరంగా జరిగారు. తనకు అధిష్టానం సరైన గుర్తింపు ఇవ్వడం లేదని బాహాటంగానే బయటపడ్డాడు.
అలకపూనిన ప్రతిమారు పార్టీ పెద్దలైన సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి వంటి వారు బ్రతిమాలి పార్టీలోనికి తీసుకువచ్చారు. తీరా ఎన్నికల సమీపించే సమయానికి బాలినేనిని పక్కన పెట్టి, మాట మాత్రం సమాచారం ఇవ్వకుం డా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లాలోని ఆరు సీట్లను అనౌన్స్ చేశాడు. దీంతో పార్టీపై అలిగిన బాలినేని ఎంపీ సీటును మాగుంటకు ఇవ్వాలని ప్రత్యేక డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు. అంతేకాకుండా ఒంగోలు నగరంలో తాను ఇచ్చిన హామీ మేరకు 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి అవసరమైన స్థల సమీకరణకు నిధులను మంజూరు చేయాలని పట్టుపట్టారు. పలుమార్లు చర్చలకు పిలిచిన పార్టీ అధిష్టానం ఇళ్ల స్థలాల డబ్బులను మంజూ రు చేసింది. కానీ ఒంగోలు ఎంపీ సీటు మాగుంట కు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పింది . దీంతో బాలినేని తన కుమారు డితో సహా పలు పేర్లను ప్రత్యామ్నాయంగా అధిష్టానం ముందు ఉంచారు.
బాలినేని డిమాండ్ ను పట్టించుకోకుండా, చిత్తూరు జిల్లా చంద్రగిరి కి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. దీంతో బాలినేని అగ్గిమీద గుగ్గిల మయ్యారు. తన కుటుంబ సభ్యులు, తన అనుచరుగణంతో ప్రత్యేకంగా సమావేశమై తాను ఏం నిర్ణయం తీసుకోవాలనే విషయంపై విజయవాడలోనే చర్చలు ప్రారంభించారు. బాలినేని , మాగుంట వద్దకు వెళ్ళడాన్ని సీరియస్ గా తీసుకు న్న అధిష్టానం ఆ స్థానంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నిలబెట్టేందుకు సిద్దమైంది. చెవిరెడ్డి ని నిలబెడి తే సహకరించే ప్రసక్తేలేదని బాలినేని కరాఖండీగా చెప్పటమే కాక ఇక జగన్‌ను కలిసేది లేదని కూడా స్పష్టం చేశారు. దీంతో అధినాయకత్వం పునరాలోచనలో పడింది.
బాలినేనిన సముదాయించేందుకు ట్రబుల్ షూటర్లు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. శ్రీనివాస్ రెడ్డితో మంతనాలు జరిపినా లాభం లేకపోయింది. అటు జగన్ ఉద్దేశం స్పష్టం కావడంతో మాగుంట ప్రత్యామ్నాయం వైపు వేగంగా పావులు కదుపుతున్నారని.. టీడీపీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతు న్నారని తెలిసింది. ఈ పరిణామాలు ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణులను కలవరపరుస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఇటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనుచరుగణం కూడా అతన్ని త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఏ నిర్ణయం తీసుకున్నా అతని వెంట నడిచేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నా రు. మరోవైపు పార్టీ అధిష్టానం సీటు ఇవ్వకపోవడంతో పాటుగా అవమానకరమైన రీతిలో ప్రవర్తించిందని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా తన అనుచరుగనంతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి తన బల నిరూపణ చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
మాగుంటకు టికెట్ ఇవ్వనని గతంలోనే చెప్పిన జగన్.. ప్రత్యామ్నాయంగా జిల్లాకు చెందిన కొందరు నాయకులతో పాటు చెవిరెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. దీనిపై మాట్లాడేందుకు బాలినేనిని విజయవాడ పిలిపించారు. అయితే విజయసాయిరెడ్డి ఆయనకు ఫోన్ చేసి.. ఒంగోలు ఎంపీ అభ్యర్ధి గా చెవిరెడ్డిని సీఎం ఖరారు చేశారని చెప్పారు. అంతేగాక తన పరిధిలో ఉన్న కొత్త ప్రకాశం జిల్లా, అలాగే నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కావలి నియోజకవర్గాల పార్టీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగిస్తున్నారని తెలిపారు. దీంతో బాలినేని ఒక్కసారిగా మండిపడ్డారు. మాగుంటకు కానిపక్షంలో జిల్లాలో మరెవరికైనా అవకాశం ఇవ్వాలని తాము కోరుతుంటే.. జిల్లాలో ఎవరినీ సంప్రదించకుండా చెవిరెడ్డిని ఖరారుచేయడాన్ని ఆక్షేపించారు. పైగా పార్టీ బాధ్యతలు కూడా అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.
ప్రస్తుత పరిణామాల పట్ల ఆగ్రహం చెందిన బాలినేని తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారని తెలియడంతో సజ్జల.. ఆయన బసచేసిన హోటల్‌కు వెళ్లి చర్చించారు. ఒకసారి సీఎంను కలవాలని సూచించగా.. ‘ఇంక కలిసేందుకు ఏముంది? ఒంగోలులో నివాసస్థల పట్టాల కోసం నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు.. ఇక పార్టీ వ్యవహారాలు పట్టించుకోను’ అని తేల్చిచెప్పినట్లు తెలిసింది. సజ్జల బయటకు వెళ్లేటప్పుడు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మా పార్టీ వ్యవహారాలు మీకెందుకంటూ కసురుకుంటూ వెళ్లిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. తర్వాత బాలినేని అదే హోటల్లో తన కుటుంబ సభ్యులు, అక్కడికొచ్చిన ముఖ్య అనుచరులతో సమాలోచనలు సాగించారు. మరోవైపు ఒంగోలు లోక్‌సభ టికెట్ ఆశించిన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది.
ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను దర్శి నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కనీసం మర్యాద కోసం కూడా మద్దిశెట్టిని బూచేపల్లి కలవలేదు. పైగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఒకరిద్దరు మద్దిశెట్టి అనుచరులతో మంతనాలు చేస్తున్నారు. దర్శి నుంచి తప్పించి నందున ప్రత్యామ్నాయంగా తనకు ఒంగోలు లోక్‌సభ టికెట్ ఇవ్వాలని సీఎంను మద్దిశెట్టి కోరగా.. అంగీకరించలేదు. అధిష్టానం చెవిరెడ్డి పేరును ఖరారు చేయడంతో మద్దిశెట్టి కూడా తన రాజకీయ భవిష్యత్‌పై దృష్టిసారించారు. తన అనుచరులతో దర్శిలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. వారి అభిప్రాయాలు విన్నాక తుది నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది.
బాలినేనితో విజయసాయి, సజ్జల మంత్రాంగం ఫలించలేదని, ఆయన వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీనిపై ఆయన్ను సంప్రదించగా తాను పార్టీకి రాజీనామా చేస్తానని ఎవరితోనూ చెప్పలేదన్నారు. రాజీనామా చేశానంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని తేల్చిచెప్పారు. ఒంగోలు లోక్‌సభ టికెట్ మాగుంటకే ఇవ్వాలన్న డిమాండ్‌పై పునరాలోచన లేదని స్పష్టం చేశారు. చెవిరెడ్డిని నిలబెడితే సహకరించబోనని విజయసాయి, సజ్జలకు స్పష్టం చేశానని కూడా బాలినేని చెప్పారు. ఈ పరిణామం లో జిల్లాలో వైసీపీకి గట్టి షాకే ఇస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ప్రకాశం జిల్లాలో వైసిపి ఇప్పటివరకు విడుదల చేసిన నాలుగు లిస్టులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆరు నియో జకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపింది. వారు అధిష్టా నానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించడం జిల్లాలో పార్టీ పరిస్థితి కి అర్థం పడుతుంది. పదేపదే అలుగుతున్న బాలినేని బుజ్జగించేందుకు అధిష్టానం వైపు నుంచి కూడా ప్రయత్నాలు తగ్గినట్లు సమాచారం. దీంతో బాలినేని తన రాజకీయ భవిష్యత్ ను ఏ పార్టీ నుంచి నడపబోతున్నారు అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జోరందుకుంది . ఏది ఏమైనా వైసీపీ అధిష్టానం, బాలినేని మధ్య సంబంధాలు దాదాపు దెబ్బతిన్నాయి. బాలినేని అధిష్టానం ముందు పెట్టిన డిమాండ్లన్నింటిని అంగీకరించడానికి పార్టీ నాయకత్వం కూడా కూడా సిద్ధంగా లేదని స్పష్టమైపోతోంది. అదే సమ యంలో బాలినేని బావమరిది వైవి సుబ్బారెడ్డిని జిల్లా బరిలో దించేందుకు కూడా అధిష్టానం ప్రయత్నాలు ప్రారం భించినట్లు సమాచారం. బాలినేని దిగివచ్చి డిమాండ్లను సడలించుకుంటారా … లేక పార్టీ మారి తన పట్టు నిరూపిం చుకుంటారా….. అనేది వేచి భవిష్యత్తు తేల్చాల్సిందే.


