మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎవరు ? ఇప్పుడు దీనిపైనే ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీలో ఉన్న సీనియర్ నేత దేవినేని ఉమ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారా ? లేదంటే వైసీపీ నుంచి రాబోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బరిలో ఉంటారా ? వీరిద్దరూ కాదంటే మరో నేత ఎన్నికల గోదాలో దూకే ఛాన్సుందా ? కరవమంటే కప్పకు… విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మైలవరం సీటు విషయంలో టీడీపీ పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు ఎందుకీ పరిస్థితి ?
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. మరోసారి అధికారం లోకి వచ్చేందుకు వైసీపీ… ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్ చేజిక్కించుకునేందుకు టీడీపీ-జనసేన కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఖరారులో మునిగి తేలుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అయితే.. ఇతర నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా… మైలవరం అసెంబ్లీ స్థానంలో మాత్రం పరిస్థితి ఏంటి ? రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అన్న వాదన బలంగా విన్పిస్తోంది.
వైసీపీపై అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్… టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. దీంతో… టీడీపీలో ఉన్న మరో సీనియర్ నేత దేవినేని ఉమా పరిస్థితి ఏంటన్న వాదన తెలుగు తమ్ముళ్లలో విన్పిస్తోంది. నిజానికి… ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న అత్యంత కీలక నియోజకవర్గాలలో ఒకటి మైలవరం. రాష్ట్ర రాజకీయాల్లోనూ ఈ అసెంబ్లీ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ్నుంచి హేమాహేమీల్లాంటి నేతలు బరిలో దిగారు. తమ సత్తా చాటారు. అయితే.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్.. టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమాపై ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా సైలెంట్‌గా తనపని తాను చేసుకుపోతున్నారు ఎమ్మెల్యే వసంత. అయితే.. పార్టీలో తనకు ఎదురైన, ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితులను పలుమార్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు వసంత కృష్ణ ప్రసాద్. అయినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేదని పలుమార్లు తన అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వసంత. అప్పట్నుంచి పార్టీ అధిష్టానంతో ఆయనకు దూరం పెరిగింది. ఇటీవలె ఆయన తన స్వరం మరింత పెంచారు. పార్టీలోని నేతల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణాస్త్రాలు సంధించారు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందంటూ ప్రచారం మరింత ఊపందుకుంది.
ఇది గమనించిన వైసీపీ అధిష్టానం. ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల కోసం అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ పోతున్నారు జగన్. నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల పేరుతో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా మైలవరం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా తిరుపతి రావును ప్రకటించారు వైసీపీ అధిష్టానం పెద్దలు. దీంతో… మరింత అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్. ఈసారి ఏకంగా సీఎం జగన్ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు ఒకమాట.. ఎన్నికల తర్వాత మరోమాట చెప్పారంటూ ఫైరయ్యారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా నని అప్పుడే చెప్పిన ఆయన. అతి త్వరలోనే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. టికెట్ ఖాయం అన్న హామీతోనే టీడీపీలో చేరబోతున్నారని.. అందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని అంటున్నారు. మరి.. ఇలాంటి వేళ.. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి దేవినేని ఉమ పార్టీలో చాలా సీనియర్. టీడీపీ హయాంలో కీలక మంత్రిగానూ పనిచేశారు. ఇంకా చెప్పాలంటే టీడీపీలో అధినేత చంద్రబాబు తర్వాత అనధికారికంగా నెంబర్ 2గా గత కొంత కాలం వరకూ చెలామణీ అవుతూ వస్తు న్నారు. మరి.. ఇంతటి నేతకు టికెట్ విషయంలో ఎందుకీ టెన్షన్ అంటే చాలానే ఉందన్న వాదన బలంగా విన్పిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి అవకాశం ఇవ్వొద్దని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల వద్దన్న లక్ష్యంతో చేతులు కలిపాయి టీడీపీ-జనసేన పార్టీలు. త్వరలోనే బీజేపీ సైతం తమతో కలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు..జన సైనికులు. మరోవైపు.. జగన్ ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన ఎమ్మెల్యేలు, టికెట్ దక్కని సిట్టింగ్‌లను పార్టీలో చేర్చుకోవాలని భావించారు తెలుగుదేశం అధినేత. ఇందులో భాగంగా ఇప్పటికే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోగా.. మరికొందరూ ఆ దారిలో ఉన్నారు. అయితే.. పక్క పార్టీల నుంచి వచ్చే అందర్నీ తీసుకోకుండా చంద్రబాబు జాగ్రత్త వహిస్తున్నారు. పార్టీ పరంగా సర్వేలు చేయిస్తున్న అధినేత కొందరికి మాత్రమే ఓకే చెబుతున్నారు. అదే సమయంలో సొంత పార్టీలో ఉన్నటువంటి నేతల్లో ఎవరికి టికెట్లు కేటాయించాలి… ఎవరికి ఈసారి చెక్ చెప్పాలి..పొత్తులో భాగంగా ఏ సీటు ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై సుదీర్ఘంగా సమాలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతల టికెట్ల విషయంలో చంద్ర బాబు కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మైలవరం నుంచి దేవినేని ఉమాకు గెలుపు అవకాశాలు తక్కువనే రిజల్ట్ వచ్చిందని అందుకే చంద్రబాబు వసంత కృష్ణ ప్రసాద్ వైపు మొగ్గు చూపారన్న టాక్ నడుస్తోంది.
అయితే… ఇక్కడే ఒక ప్రశ్నమైలవరం టీడీపీ కేడర్‌లోనే కాదు.. మాజీ మంత్రి దేవినేని ఉమా వర్గంలోనూ తలెత్తుతోంది. మైలవరం నుంచి వసంత పోటీ చేస్తే మరి.. దేవినేని పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న విన్పిస్తోంది. ఆయన్ను పెనమ లూరు నుంచి లేదంటే మరో చోటు నుంచి పోటీ చేయిస్తారన్న వాదనా బలంగా విన్పిస్తోంది. కానీ, ఉమా మాత్రం మరో స్థానానికి వెళ్లేందుకు ససేమీరా అంటున్నట్లు తెలుస్తోంది. గత నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిన తనను కాదని.. మరొక రికి సీటు ఇవ్వవద్దంటూ ఇప్పటికే ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. అయితే.. ఇదే విషయంలో చంద్రబాబు మాత్రం దేవినేని ఉమకు క్లారిటీ ఇచ్చేశారన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది. ఇంతకీ టీడీపీ అధినేత ఎవరి అభ్యర్థిత్వానికి ఓకే చెబుతారు ? మైలవరం అభ్యర్థి ఎవరు అన్నది త్వరలోనే తేలిపోనుంది .