భారత్‌తో పోలిస్తే మాల్దీవులు చాలా చిన్నదేశం. పొరుగున ఉన్న దేశం కావడంతో మాల్దీవులపై భారత్‌కు ప్రేమ ఎక్కువ. ఈ కారణంతోనే మాల్దీవులు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారీ భారత్ ఆదుకుంది. 1988లో మాల్దీవుల్లోని గయూమ్ ప్రభుత్వంపై కుట్ర జరిగింది. కుట్ర సంగతి తెలియగానే భారత్ వెంటనే స్పందించింది. గయూమ్ ప్రభుత్వాన్ని కాపాడిం ది.అంతేకాదు 2004లో మాల్దీవుల్లో సునామీ సంభవించింది. అప్పుడు కూడా భారత్ వెంటనే రంగంలోకి దిగింది. పర్యాటక దేశాన్ని అక్కున చేర్చుకుంది. 2014లో మాల్దీవుల్లో నీటి సంక్షోభం వచ్చింది. దీంతో విమానాల నుంచి మంచినీటి ట్యాంకర్లను మాల్దీవులకు తరలించింది భారత్. 2020లో మాల్దీవుల్లో తట్టువ్యాధి వచ్చింది. వేలాదిమంది తట్టువ్యాధి బారిన పడ్డారు. దీంతో మూడు లక్షల డోస్‌ల వ్యాక్సిన్లను మాల్దీవులకు తరలించింది భారత్. వీటన్నిటికి మించిన సాయం కోవిడ్ సమయంలో చేసింది భారత్. 2021లో కోవిడ్ స్వైర విహారం చేసినప్పుడు లక్ష డోస్‌ల వ్యాక్సిన్లను మాల్దీవులకు అందచేసింది మనదేశం.
మాల్దీవుల్లో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులున్నాయి. వీటన్నిటికీ మనదేశం సాయం అందచేసింది. ఈ ప్రాజెక్టులను భారత్ తన స్వంత డబ్బుతో అభివృద్ది పరచింది. మాల్దీవుల్లోని హనిమథో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రస్తుతం బాగా పాపులరైంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న టెర్మినల్ నిర్మాణానికి భారత్ సాయం అందిస్తోంది. హెల్త్ కేర్ విషయంలోనూ మాల్దీవులకు భారత్ సాయం చేస్తోంది. మాల్దీవుల్లో ఇప్పటికే ఇందిరా గాంధీ స్మారక ఆస్పత్రి ఉంది. ఈ ఆస్పత్రిని ప్రస్తుతం అభివృద్ది చేస్తున్నారు. దీనికి భారతదేశమే ఆర్థిక సాయం చేస్తోంది.
ఇవేకాదు….మాల్దీవుల్లో విద్యారంగం అభివృద్దికి కూడా మనదేశం సాయం అనేకసార్లు సాయం అందచేసింది. ఇప్పటికీ సాయం చేస్తూనే ఉంది. సాంకేతిక విద్య, ఉపాధ్యాయులకు శిక్షణ, యువతకు వృత్తిపరమైన శిక్షణ అందించడంలో పర్యాటక దేశానికి పలుసార్లు సాయం చేస్తోంది భారతదేశం. ఇక్కడో విషయం చెప్పుకుని తీరాలి.మాల్దీవుల్లోని శిక్షణపొందిన, నిపుణత కలిగిన టీచర్లు అందరూ భారతీయులే కావడం విశేషం.
మాల్దీవుల్లోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల పర్యవేక్షణ, సముద్ర భద్రత విషయాల్లో భారత్ అనేక సంవత్సరాలుగా తోడ్పాటు అందిస్తోంది. వాస్తవానికి 1988 నుంచి భారత్- మాల్దీవుల మధ్య రక్షణ సహకారం పెరిగింది. 2008 నుంచి 2012 వరకు మాల్దీవులకు మహమ్మద్ నషీద్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సమయంలో మాల్దీవులకు రాడార్లు, హెలికాఫ్టర్లను భారత్ సరఫరా చేసింది. అంతేకాదు…మాల్దీవుల సైన్యం బాగోగుల కోసం ఒక ఆస్పత్రిని కూడా నిర్మించింది. వీటితోపాటు మాల్దీవుల యువకులకు వైద్యరంగంలోనూ, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది భారతదేశం.
మాల్దీవుల జాతీయ రక్షణ దళాలకు భారత్ శిక్షణా సదుపాయాలను ఎక్కువగా సమకూర్చింది. మాల్దీవుల డిఫెన్స్ శిక్షణలో 70 శాతానికిపైగా భారతదేశమే అందించింది. ఇలా ఒకటని కాదు..అనేక రంగాల్లో మాల్దీవులకు సాయం అందించింది భారతదేశం. మాల్దీవులు పర్యాటకంగా పేరున్న దేశం. దీనిని ఎవరూ కాదనరు. మాల్దీవులకు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వస్తుంటారు. అయితే వీరిలో భారత్ నుంచి వచ్చే పర్యాటకులే ఎక్కువ. భారత్ నుంచి టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో మాల్దీవులకు బోలెడంత విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. మాల్దీవుల్లో అంతర్గత రాజకీయాలు ఎక్కువే. అంతేకాదు ఇస్లాం ఫండమెంటలిస్టులు కూడా కనిపిస్తుంటారు. వీటన్నిటికితోడు మాల్దీవుల విదేశాంగ విధానం ఇటీవలికాలంలో మారింది. కష్టాలు వచ్చినప్పుడు సాయం చేసిన భారత్‌ను మాల్దీవులు పక్కన పెట్టడం ప్రారంభించింది. అంతేకాదు అనవసరంగా భారత్ పట్ల ద్వేష భావం పెంచుకుంది. వీటన్నిటికి తోడు చైనా అనుకూల వైఖరి తీసుకుంది కొత్తగా వచ్చిన మహమ్మద్ మాయిజ్జు ప్రభుత్వం