బీహార్‌లో అధికార కూటమి JDU, RJDల బంధం దాదాపుగా బీటలు వారింది. బీజేపీ మద్దతుతో రెండు రోజుల్లో JDU నేతృత్వంలో కొత్త ప్రభుత్వం రానుందని తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ రేపు మళ్లీ ప్రమాణం చేయనున్నారని సమాచారం. వచ్చే శాసనసభ ఎన్నికలు జరిగే 2025 వరకూ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, బీజేపీ నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇరు పక్షాల మధ్య కేబి నెట్ స్థానాల పంపకాలు, లోక్‌సభ సీట్ల సర్దుబాటుపైనా ఒప్పందం తుది దశలో ఉందని పలు జాతీయ మీడియా సంస్థ ల కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఈ నెల 28న నీతీశ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం.. మహారాణా జయంతి సందర్భంగా నీతీశ్ ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొ నాల్సి ఉంది. ఇప్పుడు ఇది జరుగుతుందో, లేదో అన్న దానిపై స్పష్టత లేదు.
రాజకీయ కూటములను తరచూ మార్చే నీతీశ్ కుమార్ తాజా మార్పునకు కారణాలను విశ్లేషిస్తే.. తన సంకీర్ణ భాగ స్వాములైన RJD, కాంగ్రెస్ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధానం గా అధికార భాగస్వామి RJDతో నీతీశ్ విసిగిపోయారని తెలిపాయి. ఆ పార్టీకి చెందిన మంత్రులు తేజస్వీయాదవ్, తేజ్‌ప్రతాప్ యాదవ్‌లు కీలక శాఖలు నిర్వహిస్తూ.. ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీతీశ్‌తో సంప్రదించడం లేదని తెలిపాయి. దీంతో నీతీశ్ తీవ్రమైన అసంతృప్తికి, ఆగ్రహానికి లోనై వారిపై విమర్శలు కూడా చేశారు. అయితే ప్రభుత్వ మనుగడకు ముప్పువాటిల్లుతుందని కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. దీనికి తోడు నీతీశ్ చేసిన కుటుంబ రాజకీయాల వ్యాఖ్యపై లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర స్పందన ఆయన్ను ఇబ్బందిపెట్టింది.
గత నవంబరులో తేజస్వీ యాదవ్ బిహార్ భవిష్యత్ ముఖ్యమంత్రంటూ RJD నెలకొల్పిన పోస్టర్లు నీతీశ్‌లో అలజడి రేకెత్తించాయి. వీటికి తోడు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపకాలపై కాంగ్రెస్ నాన్చివేత ధోరణి ఆయన్ను విసుగెత్తించింది. విపక్ష ఇండియా కూటమి రూపకల్పనలో కీలక పాత్ర పోషించినప్పటికీ కూటమి అధ్యక్షుడిగా ఇటీవల కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గేను ఎన్నుకోవడం ఆయన అసంతృప్తి జ్వాలలపై ఆజ్యం పోసింది. ఈ పరిణామాలన్నీ ఆయన్ను మళ్లీ NDA వైపు చూసేలా చేశాయి. గతంలో JDU చాలా కాలం NDAలో భాగస్వామిగా ఉండేది. తరువాత RJDతో చేయి కలిపింది.