తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 76 మందినే కేటాయించారని తెలిపారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ కోసం అదనంగా 29 పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి అధికారులను అదనంగా కేటాయిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్‌రెడ్డి అమిత్‌షాను కలవడం ఇదే ప్రప్రథమం. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు అంశాలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని వివిధ అంశాలను పరిష్కరించాలని అమిత్ షాను కోరారు.యాంటీ తెలంగాణ నారోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలని వినతి పత్రంలో తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, హెచ్చార్సీ వంటి భవనాలనువినియోగించుకున్నారు కాబట్టి, ఏపీ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.