బాంబు పేలుళ్లు, భారీ హింస మధ్య పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అనంతరం ఓట్ల లెక్కింపూ ప్రారంభం కాగా నేడు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. జాతీయ అసెంబ్లీ, నాలుగు ప్రావిన్సుల శాసనసభల కోసం జరుగుతు న్న ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలో పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున పాకిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లు, కాల్పులతో వణికిపోయింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. బాంబులు విసిరి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందగా… మరో ఆరుగురు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా… ఉగ్రవాదులు అక్కడినుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు.


