హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు రోజురోజుకీ శృతి మించుతున్నాయి. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు. పోనీ.. సర్వీస్ అన్నా సరిగా ఇస్తున్నారా.. అంటే అదీ లేదు. ఏదైనా సమస్య వస్తే నడి రోడ్డు మీదే వదిలేసి వెళ్లిపోతున్నారు. అటు డబ్బులు పోయి.. ఇటు ఒళ్లు గుల్ల చేసుకుని ప్రయాణికులు నానా అవస్థలు పడుతూ ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి. అటు ట్రావెల్స్ మాత్రం ప్రయాణికుల నుంచి డబ్బులు దోచుకుని తమ జేబులు నింపుకుంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌పై ప్రభుత్వానికి సరైన కంట్రోల్ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి.
తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వేలకు వేలు టికెట్లు బుక్ చేసుకుని వెళుతున్న ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. నడిరోడ్డులో ప్రయాణికులను వదిలేసి వెళుతున్న ట్రావెల్స్ బస్సుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడుగుతున్నా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ బుక్ చేసుకున్నారో..అక్కడే అడగండి అంటూ దబాయిస్తున్నారు.
బస్సులకు సరైన పర్మిట్లు లేకపోవడంతో ప్రయాణికులను నగరశివారుల్లోనే దించేస్తున్నారు. ఇక చేసేది లేక అసలు ట్రావెల్స్ బస్సులో టికెట్స్ బుక్ చేసుకోవడమే తప్పని తెలుసుకున్న ప్రయాణికులు అక్కడే ఆన్ లైన్ లో ఉద్యోగానికి సంబంధించిన విధులు నిర్వహిస్తూ కనిపించారు. తెల్లవారుజామున నడిరోడ్డుపై ఓ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దింపివేయడంతో వృద్ధులు, పిల్లలు, మహిళలు, ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాకు ఏమీ సంబంధం లేదు అంటూ చేతులెత్తేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నిర్వాహకులపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆర్టీవో అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని ఆర్టీవో అధికారులు స్పందిస్తే కానీ అక్రమ బస్సు సర్వీసులను నివారించలేని పరిస్థితి.