కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్నారా ? 2019 ఎన్నికల సమయం లోనే ఆమె కదన రంగంలో ఉంటారన్న ప్రచారం జోరుగా సాగినా.. అప్పట్లో మాత్రం పార్టీ కార్యకలాపాలకే పరిమితమైన ఆమె… ఇప్పుడు ఎందుకు పోటీలో దిగాలని భావిస్తున్నారు ? దీనివెనక ఉన్న కారణాలేంటి ? ఇవన్నీ సరే ప్రియాంక పోటీ చేస్తే ఆమే ఏ స్థానం నుంచి ఎన్నికల కురుక్షేత్రంలో కాలు మోపుతారు ? ఇలా ఒకదాని వెంట మరోటిగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రియాంక గాంధీ.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆశా కిరణం. ఓవైపు రాహుల్ గాంధీయే భావి ప్రధాని అని పార్టీ నేతలు భావిస్తున్నా… ప్రియాంక విషయంలో మాత్రం హస్తం శ్రేణులు ప్రత్యేక అభిమానాన్ని, ఆప్యాయతను ఎప్పుడూ చూపిం చాయి.. చూపిస్తూనే ఉంటాయి. చూడటానికి ముమ్మూర్తులా ఆమె నానమ్మ.. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లాగ కన్పిస్తారు ప్రియాంక. ఆమె అంతటి వాక్చాతుర్యం, ప్రత్యర్థులను గడగడలాడించే స్థాయి ఇంకా లేకపోయినా, ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి పార్లమెంటులో అడుగు పెడితే… అన్నీ వాటంతట అవే వస్తాయని భావిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇలాంటి వేళ ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంపై హస్తం శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో ప్రియాంక గాంధీ ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నా తలెత్తుతోంది. అయితే… అందుకు సమాధానంగా విన్పిస్తున్న పేరు రాయ్‌బరేలీ. అదేంటి ఇప్పటికే అక్కడ్నుంచి సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు కదా అని ఆలోచిస్తున్నారా.. నిజమే.. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా సోనియా ఉన్నారు. కానీ, వయోభారం, అనారోగ్య కారణాల రీత్యా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగి… రాజ్యసభ బరిలో నిలుస్తారన్న వాదన గట్టిగా విన్పిస్తోంది. ఇప్పటికే తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు తమ దగ్గర నుంచి పెద్దల సభకు వెళ్లాల్సిందిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని అభ్యర్థించాయి. అయితే.. కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లొచ్చన్న టాక్ విన్పిస్తోంది.
అదే జరిగితే… ఇప్పటివరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పోటీ చేస్తున్న స్థానం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ.. లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంటారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒక వేళ అదే జరిగితే… ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలిచే స్థానం రాయ్‌బరేలీ కానుంది. ఇక, రాయ్‌బరేలీ నుంచే ప్రియాంక పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పేందుకు చాలా కారణాలున్నాయి. ఒకటి ఆ సీటు నుంచి ఇప్పటికే ప్రియాంక తల్లి సోనియా గాందీ ప్రాతినిథ్యం వహిస్తుండడం ఒకటైతే.. మరో కారణం కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న సీటు కావడం. నిజమే… 1950 నుంచి హస్తం పార్టీకి ఈ స్థానం కంచుకోట. మొదట్లో ప్రియాంక గాంధీ తాత ఫిరోజ్ గాంధీ ఇక్కడి నుంచే విజయం సాధించారు. అప్పట్నుంచి ఈ స్థానం కాంగ్రెస్‌కు పెట్టని కోటలా మారిపోయింది. 2006 నుంచి సోనియా గాంధీ స్వయంగా ఇక్కడ్నుంచే బరిలో దిగి ఘన విజయం సాధిస్తూ వస్తున్నారు. అంతెందుకు 2019 ఎన్నికల్లో మోడీ హవా బలంగా వీచింది. హేమా హామీల్లాంటి నేతలు ఓటమి చవిచూశారు. చివరకు అమేథీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సైతం ఓటమి తప్పలేదు. కానీ, రాయ్‌బరేలీ నుంచి మాత్రం సోనియాగాంధీ విజయం సాధించారు. ఈ ఒక్క ఉదాహణ చాలు.. రాయ్‌బరేలీ ప్రజలకు గాంధీల కుటుంబంపై ఉన్న ఆదరాభిమానా లు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు. దీంతో… ఈ సీటైతే ప్రియాంక గాంధీకి సురక్షితమైన సీటుగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. నిజానికి ప్రియాంక గాంధీ ఎప్పట్నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పార్టీ శ్రేణులు కోరుకున్నాయి.. ఎదురు చూశాయి. కానీ, 2019 ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు ప్రియాంక. దీంతో..యూపీలో పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే బాధ్యత ఆమెకు అప్పగించింది హస్తం హైకమాండ్. కానీ, కానీ, మోడీ హవా ముందు ప్రియాంక వ్యూహాలు పని చేయలేదనే చెప్పాలి. అప్పుడే కాదు, చివరకు 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమల నాథుల చేతిలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పలేదు.
ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రియాంక దిగుతారని వార్తలు విన్పించడానికి పలు కారణాలున్నాయి. అందులో ఒకటి తన తల్లి సోనియాగాంధీ అనారోగ్య పరిస్థితులు వాటి కారణంగా రాజ్యసభకు వెళ్లాలని యోచిస్తుండడం ఒక కారణమైతే… మరోటి 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ గెలవాల్సిన పరిస్థితి ఆ పార్టీకి చారిత్రక అవసరంగా ఉన్న నేపథ్యం. నిజమే.. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ రోజురోజుకూ బలంగా తయారవుతోంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి విస్తరిస్తూ పోతోంది. ఇలాంటి వేళ ఇండియా కూటమి పేరుతో విపక్షాలన్నీ జట్టు కట్టాయి. ఎన్డీఏను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇక, కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన వంతు ప్రయత్నాలు గట్టిగా చేస్తోంది. ఓవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర పేరుతో ప్రజల్లో ఇండియా కూటమి పట్ల సానుకూలత కలిగించేందుకు, ఎన్డీఏను ఓడించేందుకు అవసరమైన ప్రచారాన్ని చేస్తూ వస్తున్నారు. అయితే.. గాంధీ కుటుంబం నుంచి రాహుల్ ఒక్కరే కాకుండా ప్రియాంక కూడా ఎన్నికల బరిలో దిగితే మరింత ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా యూపీలో తమకు పెట్టని కోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగితే పెద్ద సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని యోచిస్తున్నట్లు సమాచారం. మరి.. నిజంగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఈసారైనా దిగుతారా లేదంటే పార్టీ కార్యకలాపాలకే మరోసారి పరిమితమవుతారా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.