పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చిచెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు ఆర్థికసాయంగా 60% నిధులు సమకూరుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.సీఎం, ఉత్తమ్‌కుమార్ గురువారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లను ప్రత్యేకంగా కలిసి పలు అంశాలపై వినతిపత్రాలను అందజేయడం జరిగింది.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ పథకం కింద 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలతోపాటు హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే పలు అనుమతులు మంజూరయ్యాయని, మరిన్ని అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అదనపు నిధుల కేటాయించేందుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని ఉత్తమ కుమార్ రెడ్డి తెలిపారు . 2014 తర్వాత ఏ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా కల్పించలేదు అన్నరు. అయితే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా 60% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.