అధికారంలో ఉన్నప్పుడు ఒకరికొకరు మద్దతిచ్చుకున్నారు కేసీఆర్, జగన్ మోహన్‌రెడ్డిలు. అదేంటో 2023 , 2024 ఎన్నికల తర్వాత కేసీఆర్ , జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ ముఖ్యమంత్రి పదవులు పోగొట్టుకుని కఠిన పరిస్థితుల్లో పడ్డారు. రేవంత్ రెడ్డి చేతిలో కేసీఆర్ ఘోర పరాజయం పాలవగా, చంద్రబాబు చేతిలో జగన్ పూర్తిగా కోలుకోలేని దెబ్బ తిన్నాడు.
ఎన్నికల తర్వాత పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియ విషయానికి వస్తే.. కేసీఆర్ , జగన్ ఇద్దరూ తమ విధానంలో అలసత్వం వహించారని చెప్పొచ్చు. కేసీఆర్ ఎక్కువగా తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైతే.. జగన్ బెంగళూరులోని తన విలాసవంతమైన యలహంక ప్యాలెస్‌కు మకాం మార్చుకున్నారు.
ప్రస్తుతం పరిణామాలు మారుతున్న నేపథ్యంలో.. తెలంగాణాలో బీఆర్ఎస్ బలోపేతంపై కేసీఆర్ దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తోంది. ఆయన తన కేడర్, స్థానిక నాయకత్వంతో పార్టీ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న కూడా ఆయన నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అక్కడ ఆయన తన పార్టీ నాయకత్వం, కష్టపడి పనిచేసే కార్యకర్తల నుండి విమర్శనాత్మక అభిప్రాయాలను తీసుకున్నారు.
మరోవైపు, ఎన్నికల తర్వాత గత తొమ్మిది నెలల్లో జగన్ ఒక్కసారి కూడా తన కార్యకర్తలను కలవలేదు. ఆయన నిర్వహిస్తున్న సమావేశాలు తన పార్టీ అగ్రనేతలతోనే కావడం గమనార్హం.
ఈ సమావేశాల్లో కూడా జగన్ ఏకపక్ష ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కువగా 30 నిమిషాల నుండి 1 గంట పాటు తన నాయకత్వాన్ని ఉద్దేశించి మాట్లాడటం.. ఆ తర్వాత వెళ్లిపోవడం.. ఇదే జరుగుతోంది. కేడర్ , స్థానిక నాయకత్వంతో జగన్ మాట్లాడి.. వారి అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకుంటున్న సందర్భాలు లేనే లేవు. ఇది కేవలం వన్-వే ట్రాఫిక్, అక్కడ కూడా జగన్ తన నాయకులతో ప్రసంగించడం..తర్వాత వారి అభిప్రాయాలు తీసుకోకుండానే సమావేశానికి ముగింపు పలకడం.
అంతేకాకుండా, సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనకు వెళ్లి తన కార్యకర్తలను కలుస్తానని గతంలో ప్రకటించిన జగన్.. ఈ ప్రణాళికపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. మొదట్లో అస్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత, ఇప్పుడు దానిని పూర్తిగా విస్మరిస్తున్నారు.
గతంతో పోల్చితే, కేసీఆర్ తన స్థానిక నాయకత్వంపై ఎక్కువ ఫోకస్ పెట్టి వారి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ బాస్ ఇప్పటికీ నిద్రాణస్థితిలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరోవైపు.. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన 2.0 పాలన ప్రారంభించిన తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూటమి నాయకులను బెదిరిస్తూనే ఉన్నారు.