పదికి ఇరవై.. వందకు వెయ్యి, పదివేలకు లక్ష.. ఇలా జోరుగా సాగుతోంది బెట్టింగ్ రాయుళ్ల దందా.నిజమే సంక్రాంతి వేళ కోడిపందేల బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. ఏడాది అంతా ఎదురు చూసే పందెంరాయుళ్లు… సంక్రాంతి వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడ్నుంచో వచ్చి ఏపీలో దిగిపోతుంటారు.
ఆంధ్రా అంతటా కోడిపందేలు జోరుగా సాగుతున్నా ప్రత్యేకించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే పందేల రూటే సెపరేటు అని చెప్పాలి. భీమవరం, ఆకివీడు, నిడమర్రు, జంగారెడ్డి గూడెం, నరసాపురం, ఉండి.. ఇలా చెప్పుకుంటూ పోతే పలు చోట్ల పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి మరీ కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఆయా పోటీల్లో పాల్గొనేందుకు తమ కోళ్లను ఏడాది పాటూ ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ సిద్ధం చేసి ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఓ వైపు కుత్తుకలు తెగేలా కోళ్లు కొట్టుకుంటుంటే.. పందేలు అంతకంతూ మారిపోతుంటాయి. పందెం మొదలు కాకముందు ఒక రేటు ఉంటే.. పోట్లాట జరుగుతున్న వేళ నిమిష నిమిషానికి రేట్లు మార్చేస్తుంటారు బెట్టింగ్ నిర్వహకులు. పరువే పెట్టుబడిగా భావిస్తూ ఆ సమయంలో పందెం రాయుళ్లు వందలు, వేలు కాదు.. లక్షలు కాస్తుంటారు.
ఏటా పెద్ద ఎత్తున సాగే కోడి పందేల్లో పాల్గొనేందుకు, చూసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం జనం భారీగా తరలి వస్తుంటారు. దీంతో.. ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న హోటల్ రూమ్‌లకు కూడా పెద్ద ఎత్తున గిరాకీ ఉంటుంది. ఇక, పోటీలకు వచ్చే వారి కోసం బరుల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ మందు, విందులు, పేకాటలు, ఎల్‌ఈ డీ స్క్రీన్లు.. ఇలా ఒకటేమిటి ఎన్నో ఏర్పాట్లున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే…ఈ మూడు రోజుల పాటు ఇదే లోకమ న్నట్లు బతికేసే పందెం రాయుళ్లు ఎందరో ఉన్నారు.


