తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. రెండు కొత్త పథకాలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. మాజీ సీఎం కేసీఆర్ సభకు తొలిసారిగా హాజరయ్యే అవకాశం ఉండడం.. కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా జలాల వివాదం చర్చకు రానుండటంతో.. ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 11:30 గంటలకు ఉభ య సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళ సై ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 26 న గవర్నర్ చేసిన ప్రసంగంపై ఇప్పటికే బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పింది. అయితే ఇప్పు డు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం ఏ విధంగా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. బడ్జెట్ సమావేశాలు వారం రోజులకు పైగా జరిగే అవకాశం ఉంది. తొలిరోజు గవర్నర్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మరో రోజు సభా సమయాన్ని కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక బడ్జెట్ ప్రతిపాదనకు ఒక రోజు కేటాయించి.. రెండు, మూడు రోజులు బడ్జెట్ పై చర్చ చేపట్టే అవకాశం ఉంది. ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేసి రెండు రోజులు సభలో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వారం రోజులకు మించి సమావేశాలు జరగవచ్చు. అయితే బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరగాల్సి ఉన్నా..ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కావడం, త్వరలో లోక్ సభ ఎన్నికల షెడ్యుల్ విడుదల అవుతుందన్న వార్తలతో..వారం రోజులకు మించి అసెంబ్లీ సమావేశాలు జరగవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలోనే బడ్జెట్ పనిదినాలు, ఎజెండా ఖరారు కానుంది.
శాసనసభలో 10 తేదీన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు.. శాసన మం డలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. మరుసటి రోజు సభ కి సెలవు కార ణంగా, సభ 12న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సభ లో చర్చ జరుగుతుంది. సమావేశాలను ఈ నెల 17 వరకు నిర్వహించే అవకాశం ఉంది.. పరిస్ధితిని బట్టి సమావేశాలు పొడగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. తెలంగాణ లో కొత్త గా ఏర్పడిన ప్రభుత్వం తమ తొలి బడ్జెట్ ని ప్రవేశ పెట్టనుంది..ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖ కి ఎంత కేటాయింపులు ఉంటాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది… కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేస్తోంది. మరో రెండు గ్యారెంటీల అమలు కు ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించ నున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి బిల్లు కట్టే అవసరం లేదని గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ రెండు పథకాలకు అర్హత కలిగిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయనేదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ రెండు పథకాలను సభలో సీఎం ప్రకటించనున్నా రు. అభయ హస్తం ద్వారా అప్లై చేసుకున్న వారిలో ఎంత మంది ఏ పథకానికి అర్హులన్న లెక్కలను సేకరించింది ప్రభుత్వం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఇప్పటికే విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సభలో ప్రతిపక్షాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి తోడు మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు కృష్ణాజలాల వివాదం, కాళేశ్వరం, మేటిగడ్డ కుంగు బాటు అంశాలు చర్చ కొస్తే.. అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. సభ.. రణరంగంగా మారే అవకాశం లేకపోలేదు.