నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బిగ్ షాట్ ను రంగంలోకి దింపేందుకు ఆ పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్టు, ఆయన టీడీపీలో చేరి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మసీ డైరెక్టర్ ను నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బంధువైన అరబిందో శరత్ చంద్రారెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తే, జిల్లాలో వైసీపీకి ఆర్థికంగా, రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని వైసీపీ అధి ష్టానం భావనగా తెలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా ఏడో జాబితాలో పర్చూరు నియోజకవర్గంతో పాటు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్ ల నియామకం జరిగింది. పర్చూరులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను తప్పించి ఆయన స్థానంలో ఎడంబాలజీకి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. కందుకూరు నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిని పక్కనట్టారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎన్నికల బరిలో దింపాలని సీఎం జగన్ భావించారు. అయితే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. ఆయన త్వరలో టీడీపీలో చేరి ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ధీటైన అభ్యర్థిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆర్థికంగానే కాక అన్నివిధాలా ఎదుర్కోగల నేత కోసం వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు చేశారని, అందులో భాగంగానే అరబిందో ఫార్మసీ అధినేత శరత్ చంద్రారెడ్డి పేరును సీఎం పరిశీలిస్తున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఫార్మసీ అధినేత శరత్ చంద్రారెడ్డి నెల్లూరు జిల్లాకే చెందినవారు కావడం, పార్టీ సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డికి బంధువు కావడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన్ని వైసీపీ తరఫున పోటీ చేయించే అంశంపై సీఎం జగన్ దృష్టి సారించారని తెలిసింది. అయితే, శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి, అరెస్ట్ చేశాయి. మద్యం కుంభకోణంలో తన ప్రమేయం ఏమీ లేదని శరత్ చంద్రారెడ్డి తెలియజేస్తున్నారు. శరత్ చంద్రారెడ్డి పై ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన్ని నెల్లూరు ఎంపీగా పోటీ చేయిస్తే వైసీపీకి ఉపయోగంగా ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం. నెల్లూరు పార్లమెంట్ సీటు మొదటి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉంది. సీఎం జగన్, వైసీపీ స్థాపించిన కొత్తలో కాంగ్రెస్ ఎంపీ పదవికి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా చేశారు. అక్కడి నుంచే తిరిగి వైసీపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ,2019 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ సీటుని వైసీపీ కైవసం చేసుకుంది. 2024 ఎన్నికల్లో సైతం తిరిగి నెల్లూరు ఎంపీ సీటును దక్కించుకునేందుకు అక్కడ బలమైన అభ్యర్థి శరత్ చంద్రారెడ్డి అని వైసీపీ అధిష్టానం ప్రగాఢంగా నమ్ముతోంది.