అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనతో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా మరింతగా పెరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది ఇప్పటి అంశం కాదు. దాదాపు ఐదు వందల ఏళ్ల నుంచి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. అయోధ్య, శ్రీరామచంద్రుడి జన్మస్థలమన్న సంగతి అందరికీ తెలి సిందే. ఈ నేపథ్యంలో రాముడి జన్మస్థలంలో ఆయనకు అత్యంత సుందరంగా ఒక మందిరం నిర్మించాలన్నది భారతీయుల కల. ఆ కల చాలాకాలం పాటు కలగానే మిగిలింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఒకటి కాదు. రెండు కాదు. అనేక అవరోధాలు ఎదురయ్యాయి. అడ్డంకులు తలెత్తాయి. అయోధ్య అంశం వివాదాస్పదమైంది. దీంతో అయోధ్య వివాదం మొదట అలహాబాద్ హై కోర్టుకెళ్లింది. ఆ తరువాత సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడి కేసు విచారణ జరిగింది.
చివరకు అయోధ్య వివాదంపై 2019 నవంబర్ తొమ్మిదో తేదీన సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం రామ్‌లల్లాకే చెందుతుందని ఐదుగురు సభ్యులున్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. దీంతో రామ మందిర నిర్మాణానికి 2020 ఆగస్టు ఐదో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. శంకుస్థాపన చేసిన నాలుగేళ్ల లోపే బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన చేసి నరేంద్రుడు రికార్డు సృష్టించారు. దీంతో ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ఆంబరాన్ని తాకింది. ఇదిలా ఉంటే దాదాపుగా ఏప్రిల్ నెలలో లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చు. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన నేపథ్యంలో అయోధ్య రామమందిర అంశం లోక్‌సభ ఎన్నికల్లో కీలకం కాబోతోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా లోక్‌సభ ఎన్నికల్లో తమకు ప్లస్ పాయింట్‌గా మారుతుందని బీజేపీ వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. ఒకవైపు అయోధ్య రామాలయం మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణ తమకు
కలిసి వస్తుందని కమలం పార్టీ నాయకులు భావిస్తున్నారు.
ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో చరిష్మా విషయంలో ఇప్పటికీ నెంబర్ వన్ ప్రధాని నరేంద్ర మోడీయే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జేడీ యూ అధినేత నితీశ్ కుమార్, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ …వీళ్లందరూ జనాకర్షణ అంశంలో ప్రధాని నరేంద్ర మోడీ తరువాతే. ఈ నేపథ్యంలో అగ్నికి వాయువు తోడయినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మాకు అయోధ్య రామమందిర అంశం తోడయింది. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన విజయవంతంగా పూర్తి కావడంతో వర్తమాన భారతీయ సమాజంలో ప్రధాని నరేంద్ర మోడీ కీర్తి అంబరాన్ని తాకింది. పార్టీలకతీతంగా ప్రధాని నరేంద్ర మోదీకి అభిమానులు పెరిగారు. నిన్నమొన్నటివరకు బీజేపీయేతర పార్టీల్లో ఉండే సామాన్య ప్రజలు కూడా నరేంద్ర మోడీని అభిమానించడం మొదలెట్టారు. దాదాపు ఐదు వందల ఏళ్లనాటి హిందువుల కలను సాకారం చేసిన హీరోగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇమేజ్ వచ్చింది.
ప్రధాని కుర్చీలో నరేంద్ర మోడీ కాకుండా మరో నాయకుడు ఉంటే అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉండేదన్న అభిప్రాయం సమాజంలో నెలకొంది. పార్టీలకతీతంగా ప్రజలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ వల్లనే దేశవ్యాప్తంగా హిందూ సమాజం జాగృతమైందన్న అభిప్రాయం కూడా వినపడు తోంది. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా నరేంద్ర మోడీయే ప్రధాని కావాలన్న జనాభిప్రాయం అనేకచోట్ల వ్యక్తమవుతుం డటం విశేషం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 నియోజకవర్గాలు గెలుచుకుంది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లను కమలం పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇటు అయోధ్య అంశం అటు ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా కలగ లిస్తే 400 సీట్లు గెలుచుకోవడం అసాధ్యమేమీ కాదంటున్నారు బీజేపీ నాయకులు.