తెలంగాణలో అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ తీరు మారలేదు. టీ కాంగ్రెస్ లో అదే గందరగోళం కొనసాగుతోంది. పార్టీలో సమన్వయం పెరగడం లేదు. ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక విషయంలో అదే తేటతెల్లమైంది. దీంతో వీరు .. మారరా.. అధికార కాంగ్రెస్ తీరు మారాదా అనే అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల గడువు ముగి సేరోజు వరకూ ఎన్నో ట్విస్టులో… మరెన్ని మలుపులు అన్నట్లుగా మారింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అద్దంకి దయా కర్, మహేష్ కుమార్ గౌడ్ లకు అవకాశం కల్పించాలని మొదట అనుకున్నారు. కాని రాత్రికి రాత్రే ఎన్ఎస్ యూ ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు యువతకు అవకాశం కల్పించాల్సిందే అని తేల్చిచెప్పడంతో బల్మూరికి టికెట్ కన్ఫ్మామ్ అయ్యింది. దీంతో అద్దంకి, మహేష్ గౌడ్ ల నుంచి ఎవరినో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి. తర్జన భర్జనల అనంతరం మొదట మహేష్ గౌడ్ ను తప్పించాలనుకున్నారు. కానీ బీసీలు ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్న నేపథ్యంలో బీసీ అయిన మహేష్ గౌడ్ ను తప్పిస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కి నష్టం తప్పదనే భావనతో.. ఎమ్మెల్సీ పక్కా అనుకున్న అద్దంకిని పక్కకు పెట్టారు.
కాంగ్రెస్ లో సర్దుబాట్ల వల్ల కొందరికి అవకాశాలు చివరిక్షణంలో చేయిజారిపోవడాన్ని అర్దం చేసుకోవచ్చు. కాని అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియే సరిగా జరగలేదనే అభిప్రాయం నేతల్లోనే వ్యక్తమవుతోంది. అభ్యర్ధుల ఎంపిక ను చివరి నిమిషం వరకు తేల్చకుండా ఎందుకు నాన్చాల్సి వచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ ఇంకా కాంగ్రెస్ లో ఉంది. అలాంటప్పుడు టికెట్లు ఆశించిన నేతలతో పార్టీ పెద్దలు చర్చించి…అవకాశం దక్కని నేతలకు బుజ్జగిస్తే సరిపోయేది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేశారు. టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. దీంతో అసెంబ్లీ టికెట్ల పంపిణి సజావుగా జరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాని ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో… అభ్యర్ధులను చివరి నిమిషంలో మార్చడంతో ఎంతో గందగోళం తలెత్తింది.
వివిధ కారణాల వల్ల అద్దంకి దయాకర్ కి అవకాశం కల్పించకపోతే..ఆయనకు చెప్పి ఒప్పిస్తే… బాగుండేది. పార్టీ పెద్దలు అద్దంకిని ఒప్పించి..నామినేషన్ పర్వంలో ఆయననూ భాగస్వామిని చేస్తే మరింత బాగుండేది. పార్టీ నిర్ణయా నికి కట్టుబడి ఉంటానని అద్దంకి ప్రకటించిన తర్వాత కూడా పార్టీ పెద్దలు ఆ పని చేయకపోవడం ఆయన అభిమాను ల్ని బాధిస్తుంది. కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పెద్దల తీరు మారకపోతే ఏలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అందరినీ కలుపుకుని పోయేలా పార్టీ పెద్దల తీరు మారాలని కోరుతున్నారు. ఇదే గందరగోళం కొనసాగి తే..కాంగ్రెస్ పై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లితే పార్టీ కే నష్టమంటున్నారు సొంత పార్టీ నేతలు.