తమిళనాట రాజకీయాలు, సినీపరిశ్రమ మధ్య అవినాభావ సంబంధం ఉంది. తమిళనాడును సుదీర్ఘకాలం పాటు శాసించిన కరుణానిధి, ఎమ్జీ రామచంద్రన్, జయలలిత ..అందరూ సినీరంగం నుంచి వచ్చినవారే. వీరితో పాటు కెప్టెన్ విజయ్‌కాంత్ కూడా తమిళనాడు పాలిటిక్స్‌లో సత్తా చాటారు. జయలలిత హయాంలో కెప్టెన్ విజయ్‌కాంత్ పార్టీ డీఎండీకే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. తమిళనాడులో రాజకీయాలు, సినిమాలు పెనవేసుకుపోయాయి. తమిళనాడులోని రెండు ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే లను చాలాకాలం పాటు శాసించింది సినీరంగ ప్రముఖులు. కరుణానిధి, ఎమ్జీ రామచంద్రన్, జయలలిత …వీరందరూ సినిమా పరిశ్రమ నుంచి ఎదిగొచ్చిన నేతలు.
తమిళనాడు రాజకీయాలను రాజకీయ దిగ్గజం కరుణానిధి అయిదు దశాబ్దాల పాటు శాసించారు. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కాగా, బాల్యంలోనే రచనలపై ఆసక్తి చూపారు. అప్పట్లో జస్టిస్‌పార్టీ నేతృత్వంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు బలంగా ఉండేవి. వీటి ప్రభావంతో విద్యార్థిగా ఉన్నప్పుడే మరి కొందరు సహచరులతో కలిసి ‘ఆల్‌స్టూడెంట్‌క్లబ్’ అనే సంస్థను నెలకొల్పాడు. ద్రవిడ ఉద్యమంలో ఇదే తొలి విద్యార్థి సంఘం. నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించిన కరుణానిధి ఆ తరువాత సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. పరాశక్తి సినిమాలో ఆయన రాసిన డైలాగ్స్, మంటలు పుట్టించాయి. సినీరంగం నుంచి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు కరుణానిధి. కాలక్రమంలో డీఎంకే అధినేత అయ్యారు. తమిళ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. తమిళనాడుకు ఐదుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ద్రవిడ సంస్కృతి చాంపియన్‌గా పేరు తెచ్చుకున్నారు.
70ల నాటికి తమిళ సినీహీరో ఎమ్జీ రామచంద్రన్ డీఎంకేలోనే ఉన్నారు. అయితే 70ల్లో మాటల రచయిత కరుణా నిధి, వెండితెర వేలుపు ఎమ్జీ రామచంద్రన్ మధ్య విభేదాలు వచ్చాయి. ఫలితంగా డీఎంకేలో చీలిక వచ్చింది. దీంతో డీఎంకే నుంచి ఎమ్జీ రామచంద్రన్ బయటకు వచ్చారు. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పేరుతో ఎమ్జీ రామచంద్రన్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. 1977లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది.1977తరువాత తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. రాజకీయ పార్టీల బలాబలాలు మారిపోయాయి. 1987లో అనారోగ్యంతో చనిపోయేంతవరకు ఎమ్జీఆరే తమిళనాడు సీఎంగా కొనసాగారు.తమిళనాడు రాజకీయాలలో ఎమ్జీఆర్ ది చెరగని ముద్ర. బాల్యంలో తిండికి కూడా ఇబ్బంది పడ్డ ఎమ్జీఆర్ ఆ తరువాత సినీ, రాజకీయా రంగాలను శాసించాడు. పేదల గుండె చప్పుడు అయ్యాడు. ఎమ్జీ రామచంద్రన్ బాల్యం అంతా పేదరికంలో గడిచింది. తండ్రి చిన్నప్పుడే చనిపోయా డు. కుటుంబం గడవటం కోసం అన్నయ్యతో కలిసి డ్రామా కంపెనీలో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవితాన్ని మొదలెట్టా డు ఎమ్జీఆర్. నాటకానుభవంతో సినిమాల్లో చేరాడు, మెల్లమెల్లగా హీరో వేషాలు వేయడం మొదలెట్టాడు.
ఎమ్జీఆర్ తన సినిమా కెరీర్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. హీరోగా చేయడానికి రాబిన్ హుడ్ తరహా పాత్రలను ఎంచుకున్నాడు. సంపన్నులను కొట్టి పేదల కడుపులు నింపే పాత్రల్లో ఆయన రాణించారు. ప్రజలు కూడా ఎమ్జీ రామచంద్రన్ ను అలాగే చూడాలని కోరుకున్నారు. దీంతో ఎమ్జీఆర్ కోసం సినీ రచయితలు ప్రత్యేకంగా పాత్రలు సృష్టించారు. ఎమ్జీ రామచంద్రన్ సినిమాల్లో హీరో ఎప్పుడూ ఆదర్శ ప్రాయుడుగా ఉంటాడు.ఎమ్జీఆర్ మద్యం తాగే సీన్లు ఏ సినిమాలోనూ కనిపించవు. అంతేకాదు కనీసం సిగరెట్లు తాగే దృశ్యాలు కూడా ఉండవు. పదిమంది తనను ఆదర్శంగా తీసుకోవాలనే తాపత్రయపడ్డారు ఎమ్జీఆర్. ఎమ్జీఆర్ తరువాత అన్నా డీఎంకేలో జయలలిత చక్రం తిప్పారు. జయలలితకు మరో పేరు పురచ్చి తలైవి. అంటే విప్లవ నాయకురాలని అర్జం. తమిళనాడు రాజకీయాల్లో ఆమె నిజంగా విప్లవ నాయకురాలే, అనేక అటుపోట్లను ఎదుర్కొని ఆమె పాలిటిక్స్ లో కొనసాగారు, అప్పటి రాజకీయ ప్రత్యర్థి కరుణానిధి పై అలుపెరుగని పోరాటం చేశారు. విజయాలను సొంతం చేసుకున్నారు. తొలిరోజుల్లో ఎమ్జీఆర్ భార్య జానకీ రామచంద్రన్ తానే వారసురాలినంటూ ముందుకొచ్చారు. అయితే ఆ తరువాత అన్నా డీఎంకే క్యాడర్ , జయలలితకే జై కొట్టింది. దీంతో అన్నా డీఎంకే లో జయలలిత శకం ప్రారంభమైంది. సంవత్సరాలు గడిచేకొద్దీ అన్నా డీఎంకేకు జయ తిరుగులేని నాయకురాలయ్యారు. తమిళనాట కొన్నేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలు జయలలిత చుట్టూనే తిరిగాయంటే అతిశయోక్తి కాదు.
కరుణానిధి, ఎమ్జీ రామచంద్రన్, జయలలిత తరువాత తమిళనాడు రాజకీయాల్లో సత్తా చాటిన మరో సినీరంగ ప్రముఖుడు కెప్టెన్ విజయ్‌కాంత్. దక్షిణాదిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు గ్లామర్ తీసుకువచ్చిన స్టార్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్. డబుల్ రోల్స్‌కు కూడా విజయ్‌కాంత్ ఫేమస్. ఆయన వందో చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. ఈ సిన్మా తరువాత విజయ్‌కాంత్‌కు కెప్టెన్ అనే పేరు వచ్చింది. అప్పటినుంచీ తమిళ సినీపరిశ్రమలో కెప్టెన్ విజయకాంత్‌గా ఆయన పాపులర్ అయ్యారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇచ్చారు కెప్టెన్ విజయ్‌కాంత్. 2005 సెప్టెంబర్లో డీఎండీకే పేరుతో విజయ్‌కాంత్ ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించారు. డీఎండీకే తరఫున రెండుసార్లు తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యారు. 2011లో తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 29 నియోజకవర్గాల్లో డీఎండీకే విజయం సాధించిం ది. అంతేకాదు అసెంబ్లీలో డీఎండీకేనే ప్రధాన ప్రతిపక్షమైంది. 2011 ఎన్నికల తరువాత అప్పటి కరుణానిధి నాయకత్వా నగల డీఎంకే మూడోస్థానానికి పరిమితమైంది. ఒకదశలో డీఎంకే, అన్నా డీఎంకే తరువాత బలమైన ద్రవిడ పార్టీగా తమిళనాట విజయకాంత్ నాయకత్వంలోని డీఎండీకే పేరు తెచ్చుకుంది. అస్వస్థతతో బాధపడుతూ కొన్ని నెలల కిందట కెప్టెన్ విజయ్‌కాంత్ కన్నుమూశారు. తమిళ సినీ హీరో శరత్ కుమార్ కూడా పాలిటిక్స్‌లోకి ప్రవేశించారు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పేరుతో ప్రాంతీయ పార్టీ పెట్టారు. అయితే శరత్ కుమార్ పార్టీ తమిళ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది.


