ఢిల్లీ వాసులను చలి వణికించేస్తోంది. చలికి భయపడి జనం ఇళ్లనుంచి బయటకు రావడం లేదు. కనీస ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. గరిష్ట ఉ ష్ణోగ్రత కూడా 13 డిగ్రీలుగా ఉంది. ఈ సీజన్ లో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం రెండేళ్లలో ఇదే ప్రథమం. చలికి తోడు పొగమంచు. పది అడుగుల దూరంలో వాహానాలు కూడా కన్పించని స్థితి. పొగ మంచు కారణంగా విమానాల రాకపోకలు, ఆలస్యమవుతున్నాయి. 24 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాదిలో మరో 48 గంటలపాటు ఇదే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది.
రాజధానిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ వాయవ్య ప్రాంతం నుంచి విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఢిల్లీలో గాలి నాణ్యత కూడా మరీ దారుణంగా ఉంది. గాలి నాణ్యత ఇండెక్స్ 343 పాయింట్లకు పడిపోయింది. పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ లోనూ చలి వణికించే స్తోంది. కాన్పూర్ లో కనీస ఉష్ణోగ్రత 1.1 డిగ్రీల సెల్సియస్ ఉంటే.. ఆగ్రాలో ఒక డిగ్రీసెల్సియస్ గా ఉంది. ఢిల్లీలో పలు చోట్ల జనం చలిమంటలు వేసుకుని, దుప్పట్లు కంబళ్లు కప్పుకుని చలినుంచి రక్షించుకుంటున్నారు. ఢిల్లీలో ఇళ్లు లేక ఆరుబయట ఉంటున్న వారిని రక్షించేందుకు రిస్క్యూ టీమ్ లను రంగంలోకి దించారు. నైట్ షెల్టర్ లోకి వారిని చేరుస్తున్నారు.