తమ డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని హస్తిన వైపు వచ్చేందుకు మరోసారి కదం తొక్కారు అన్నదాతలు. పంజాబ్ నుంచి హర్యానాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో కర్షకులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. ఇక, రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. ఇదంతా కాస్త పక్కన పెడితే.. ఎన్నికల వేళ అన్నదాతల ఆగ్ర హం బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది ? గతంలో వ్యవసాయ చట్టాల విషయంలో మొండిగా ముందుకెళ్లి ఆ తర్వాత వెనక్కు తగ్గిన ప్రధాని మోడీ…ఈసారి ఏం చేయబోతున్నారు ? అసలు దేశానికి వెన్నెముఖ లాంటి అన్నదాతల విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తున్నాయి ?
అన్నదాతల నినాదాలతో పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాలే కాదు.. ఢిల్లీకి దారి తీసే అన్ని పట్టణాలు, నగరాలు దద్దరిల్లుతున్నాయి. ఇప్పటికే వేలాదిగా ఢిల్లీ సమీప ప్రాంతాల్లోని సరిహద్దులకు చేరుకున్న కర్షకులు… ఏ మాత్రం అవకాశం దొరికినా హస్తినలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరోసారి పంజాబ్-హర్యానా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో.. పోలీసులు మరోసారి భాష్పవాయువు ప్రయోగించారు. వరుసగా రెండో రోజూ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో కేంద్రం మరోసారి రైతన్నలను చర్చలకు ఆహ్వానించింది. అందుకు అనువైన పరిస్థితి కల్పించాలంటూ రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి అర్జున్ ముండా. అయితే.. తామేమీ ఘర్షణ పడేందుకు రాలేదని చెబుతున్నాయి రైతు సంఘాలు.
రైతన్నల డిమాండ్లు, వాటి విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న విషయం కాసేపు పక్కన పెడితే.. సార్వత్రిక ఎన్నికల వేళ అన్నదాతలు ఆగ్రహించడం బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపబో తోందన్న ప్రశ్న బలంగా విన్పిస్తోంది. ఎందుకంటే.. 2020 సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ఇప్పుడు అందరికీ గుర్తుకు వస్తోంది. అప్పట్లో అన్నదాతలు వాటిని వ్యతిరేకిస్తూ వేలాదిగా ఢిల్లీ వీధుల్లోకి వచ్చిన విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. గడ్డ కట్టించే చలిలోనూ మొక్కవోని దీక్షతో నిరసన చేపట్టిన రైతులు యావత్ దేశం దృష్టినీ ఆకర్షించారు. రోజుల తరబడి కొనసాగిన ఆందోళనలను ప్రభుత్వం మొదట్లో పట్టించుకోలేదన్న విమర్శ విన్పించింది. అయినా కర్షకులు వెనక్కు తగ్గలేదు సరికదా తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. దీంతో…మొట్ట మొదటిసారిగా మోడీ సర్కారు వెనక్కు తగ్గింది. స్వయంగా ప్రధాని మోడీయే రైతులకు క్షమాపణలు చెప్పారు. అప్పట్లో రైతన్నల పోరు పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. అలాం టిది ఇప్పుడు మళ్లీ అన్నదాతలు పోరుబాట పట్టారు. మరి… ఈసారి మోడీ సర్కారు ఏం చేయబోతోంది అన్న ప్రశ్న తలెత్తుతోంది.
నిజానికి దేశానికి.. అన్నం పెట్టే రైతన్నే వెన్నెముఖ అంటూ అందరూ చెబుతుంటారు. కానీ, వాళ్లు మాత్రం తమ న్యాయమైన కోర్కెల విషయంలో పోరాటం చేయందే ఏదీ దక్కని పరిస్థితి నెలకొందనే చెప్పాలి. కేవలం ఇక్కడే కాదు.. ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా ఇదే పంథాలో పోరాటం సాగుతోంది. మెక్రాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున ఉద్యమించారు ఫ్రాన్స్ రైతులు. పనికి తగిన వేతనం, అధికారుల జోక్యం తక్కువగా ఉండడం, విదేశాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టు కోవడం లాంటి అంశాలపై నిరసనలకు దిగారు. వందలాదిగా రైతులు ట్రాక్టర్లతో ఆందోళన కొనసాగిస్తు న్నారు. ఇక్కడే కాదు.. జర్మనీలోనూ ఇవే పరిస్థితులు తలెత్తాయి. జర్మనీ ప్రభుత్వం వ్యవసాయానికి ఉప యోగించే డీజిల్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో పోరుబాట పట్టారు. వారం పాటు తమ నిరసనలు కొనసా గించారు. స్పెయిల్‌లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. యూరోపియన్ యూనియన్ పర్యావరణ నిబం ధనలు, అధికంగా ఉన్న పన్నులు సహా మరికొన్ని అంశాలపై ఉద్యమించారు అన్నదాతలు. మొత్తంగా ఏదేశ మేగినా ఎందుకాలిడినా అన్నట్లుగా ఎక్కడ చూసినా అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదన్న వాదన బలంగా విన్పిస్తోంది.