ప్రజా క్షేమమే లక్ష్యంగా, పనే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేసిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ కారణంగానే ఆప్‌కు ప్రజాధరణ లభించిందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడానికి తాము ఎంచుకున్న మార్గం కోసం జైలుకు వెళ్లడానికైనా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై ఐదుగురు ఆప్ నేతలు జైలులో ఉన్నందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ నేతలను ఉద్దేశించి ఆప్ అధినేత ఈ మేరకు మాట్లాడారు.
పిల్లలకు మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. జైలుకు వెళ్లాల్సి వచ్చినా, బాధపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు సూచించారు. ఈ రోజు జైలులో ఉన్న తమ ఐదుగురు నాయకులు హీరోలే అన్నారు. వారందరినీ చూసి గర్వపడుతున్నామన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జనవరి 3న హాజరుకావాలని ఈడీ సమన్లు పంపిన నేప థ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఈడీ రెండు సార్లు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన గైర్హాజరయ్యారు.