ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల కీలక పాత్ర పోషించబోతున్నారా ? ఆమెకు ఏ పాత్ర అప్పగిస్తారు ? తెలంగాణ మాదిరిగానే ఆఖరినిమిషంలో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా ? ఇలా తలెత్తిన అనేక సందేహాలకు పుల్ స్టాప్ పడింది. కాంగ్రెస్‌లోకి షర్మిల రాకను కన్ఫర్మ్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. మరోవైపు తెలంగాణ నేతలు సైతం షర్మిలకు బాసటగా నిలుస్తున్నారు.
జగనన్న వదిలిన బాణం ఏపీ వైపు తిరిగింది. అటూ ఇటూ వెళ్లి నేరుగా అన్నపైకే రివర్సైంది. అవును నిన్న మొన్నటి వరకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో కీలక పాత్ర పోషిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే.. ఈ విషయాన్ని కొందరు నిజమేనని చెబితే.. మరికొందరు అలాంటిదేమీ ఉండకపోవచ్చన్న విశ్లేషణలూ విన్పించాయి. కానీ, చివరకు షర్మిల ఏపీ రాక ఖరారైంది. కాంగ్రెస్ పార్టీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల చేరబోతున్నారంటూ క్లారిటీ ఇచ్చారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఇటీవలె ఢిల్లీలో జరిగిన సమావేశంలో తమతో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఇదే విషయాన్ని తెలిపారని చెప్పుకొచ్చారాయన. ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన గిడుగు రుద్రరాజు.. షర్మిలకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా స్వాగతిస్తామని తేల్చిచెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పునర్వైభవం కోసం కృషి చేస్తామన్నారు గిడుగు. ఇందుకోసం వంద రోజుల ప్రణాళికతో ముందుకెళతామని తెలిపారాయన. అంతే కాదు.. వైసీపీకి చెందిన పలువురు అసంతృప్త నేతలు తమతో టచ్‌లోకి వచ్చారని ఆయన చెప్పడం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. కేవలం ఏపీ నేతలే కాదు..తెలంగాణ నేతలు సైతం ఇప్పుడు షర్మిల ఏపీ రాకను స్వాగతిస్తున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే ఫైట్ చేయాలని తాను చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు పార్టీ సీనియర్ నేత వీహెచ్. షర్మిల ఏపీ రావడంతో ప్రజల ఆలోచనా విధానం మారుతుందన్నారు. ఆంధ్రలోనూ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలని ఆకాంక్షించారు వీహెచ్. తెలంగాణ కాంగ్రెస్ నేతల కామెంట్ల సంగతి కాస్త పక్కన పెడితే… రుద్రరాజు వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా ఏపీలో కాకరేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే వైసీపీ నుంచి బయటకు వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెంట నడుస్తానని చెప్పుకొచ్చారు. ఓవైపు వైసీపీ అధినేత టికెట్లు ఖరారు చేస్తున్న నేపథ్యంలో అసంతృప్తులు మెల్లగా పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఇలాంటి వాళ్లకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేరాఫ్‌గా మారుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.


