స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతులేత్తేసింది. చేజేతులా ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7వికెట్ల తేడాతో ఓడిపోయింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రేరక్ మన్కడ్ (64)అర్ధ శతకంతో అదరగొట్టగా.. చివర్లో నికోలస్ పూరన్(44) వీరవిహారం చేశాడు. స్టాయినిస్(40) కూడా దూకుడుగా ఆడడంతో కృనాల్ సేన విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో అభిషేక్ శర్మ, ఫిలిప్స్, మయాంక్ మార్కండే తలో వికెట్ పడగొట్టారు.
15ఓవర్ల వరకూ హైదరాబాద్ చేతిలో ఉన్న మ్యాచ్ అభిషేక్ శర్మ వేసిన 16వ ఓవర్లో మొత్తం తారుమారు అయిపోయింది. ఆ ఓవర్లలో ఏకంగా 31పరుగులు రావడంతో మ్యాచ్ లక్నో వైపు మళ్లింది.
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 182/6 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్(47), అన్మోల్‌ప్రీత్ సింగ్(36), అబ్దుల్ సమద్(37) పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య 2, యుధ్విర్ సింగ్, అవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా ఒక్కో వికెట్ తీశారు.