దాదాపు రెండేళ్ల కిందట ఢిల్లీ శివార్లలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. రైతుల బతుకులు బుగ్గిపాలు చేసే మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే అప్పట్లో రైతుల ప్రధాన డిమాండ్. ఈ వ్యవసాయ చట్టాల్లో ఎక్కడా పంటలకు కనీస మద్దతు ధర ప్రసక్తే లేదు. కనీస మద్దతు ధర డిమాండ్‌కు కేంద్రం అంగీకరించక పోవడంతో అన్నదాతలు ఆగ్రహించారు. ఉద్యమం బాటపట్టారు.
ఉద్యమంలో భాగంగా ఢిల్లీ శివార్లలో రైతులు చిన్న చిన్న గుడారాలు వేసుకున్నారు. కన్నతల్లి లాంటి పుట్టిన ఊరును వదులుకుని ఎక్కడో హస్తిన శివార్లలోని గుడారాల్లో నెలల తరబడి ఉంటూ కేంద్రంపై పోరాటం మొదలెట్టారు. కేంద్రం ముందు డిమాండ్ల చిట్టా విప్పారు. అయితే అన్నదాతల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టింది. అయినప్పటికీ రైతన్నలు మనోధైర్యం కోల్పోలేదు. దీర్ఘకాలిక పోరాటాలకు సన్నద్ధమయ్యారు.వాస్తవానికి వ్యవసాయరంగంలో నూటికి 70 మంది సన్న, చిన్నకారు రైతులు. మరో 25 శాతం మంది మధ్య తరగతి రైతులు. మిగిలిన ఐదు శాతం మంది మాత్రమే భూస్వాములు. అయితే ఐదు శాతం ఉన్న భూస్వాములు ఎవరూ వ్యవసాయం చేయరు. పొలాల్లో విత్తనాలు చల్లరు. పొలాల్లో దిగి నాట్లు వేయరు. కోత కోయరు. ఎక్కడో దూరంగా పట్నాల్లో ఉంటూ, పల్లెల్లో తమకున్న వందల ఎకరాల భూములను కౌలుకు ఇచ్చుకుంటారు.
వాస్తవానికి వ్యవసాయం చేసేది సన్న, చిన్నకారు రైతులే. వీళ్లే అప్పులు తెచ్చి సేద్యం చేస్తారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తారు. ఇంతగా కష్టపడి పంటలు పండించినా, సన్న, చిన్నకారు రైతులు బావుకునేది ఏమీ లేదు. కనీసం మద్దతు ధరలు లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతు న్నారు. ఇంతగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్న సన్న, చిన్నకారు రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వవు. దీంతో ప్రైవేటు వ్యక్తుల దగ్గర పెద్ద మొత్తంలో వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటారు. పంట పండితే, నిల్వ పెట్టుకుని అమ్ముకునే యంత్రాంగం కూడా ఈ రైతులకు ఉండదు. అలాఅని ఎక్కడో దూరంగా ఉండే మార్కెట్లకు పంట తీసుకెళ్లి, అమ్ముకునే స్థోమత కూడా ఈ అన్నదాతలకు ఉండదు.
ఇదిలా ఉంటే భారతదేశ వ్యవసాయరంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అంత కుముందు చెప్పారు. నరేంద్ర మోడీ చేసిన ఈ వ్యాఖ్య రైతాంగలోకంలో దుమారం రేపింది. వ్యవసాయంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కల్పించడం అంటే సేద్యాన్ని హోల్‌సేల్‌గా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడమే తప్ప మరోటి కాదు. పార్లమెంటులో కనీసం చర్చ కూడా జరపకుండా కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలు ప్రవేశపె ట్టారు. తమ బతుకులను బుగ్గిపాలు చేసే వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అయితే రైతుల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎత్తులు, పై ఎత్తులు వేసింది. ఒక దశలో ఖలిస్తానీ తీవ్రవాదులతో రైతులకు సంబంధాలు ఉన్నాయని కేంద్రం ఆరోపణలు చేసింది. ఖలిస్థానీ బూచి చూపించి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి చేసిందంతా చేసింది. అయితే కేంద్రం చేసిన ఆరోపణలను దేశ ప్రజలెవరూ నమ్మలేదు. రైతాంగ ఉద్యమంలోని నిజాయితీని ప్రజలు విశ్వసించారు.
రైతు సంఘాల ప్రతినిధులతో కూడా చర్చలంటూ కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసింది.మొత్తం 11 సార్లు రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు ఫలించలేదు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వానికి రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే అంటారు రైతు సంఘాల ప్రతినిధులు. రోజులు గడిచేకొద్దీ, రైతులు డీలా పడతారని ప్రభుత్వం భావించింది. ఉద్యమం నీరుగారిపోతుందని సర్కార్ పెద్దలు లెక్కలు వేసుకున్నారు. అయితే అలా జరగలేదు. ఉద్యమిస్తున్న రైతులు మరింతగా రాటుదేలారు. మరోవైపు రైతాంగ ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్దతు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇక భీష్మించుకుకూర్చుంటే అసలుకే మోసం వస్తుందని ఢిల్లీ పెద్దలకు గ్నానోదయం అయింది.చివరకు వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను ఉప సంహరించు కుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఏమైనా ఢిల్లీ శివార్లలో పదకొండు నెలల పాటు జరిగిన రైతుల ఆందోళన …మనకాలపు మహోద్యమంగా చరిత్రలో నిలిచిపోయింది.