తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు అధికారులు చూపించినట్లు కాగ్ తేల్చింది. ఈ పథకంలో భారీగా నిధులు పక్కదారి పట్టించినట్లు సంచలన రిపోర్ట్ బయటపెట్టింది. చని పోయిన వారికి సైతం గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా నకిలీ రవాణా ఇన్వాయిస్ లతో 68 కోట్లు స్వాహా చేశారని తేల్చింది. దీనిపై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది.
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. నిధులు పక్కదారి పట్టించిన అధికారులు, కాంట్రాక్టర్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఏసీబీ డీజీ సీజీ ఆనంద్ పర్యవేక్షణలో కేసు విచారణ ప్రారంభమైంది. గొర్రెల స్కామ్ విషయంలో గచ్చిబౌలిలో నమోదైన కేసును పోలీస్ అధికారులు ఏసీబీకి బదిలీ చేశారు. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టులో చుక్కెదురైంది. కేసు విచారణ దశలో ఉండగా జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అంతే కాకుండా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవ సాయి పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ స్కీమ్ కి సంబంధించి గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మంది రైతులను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి వివరాలు మొత్తం సేకరిం చారు. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు పశు సంవర్దక శాఖ అధికారులు, కాంట్రాక్టర్ మోహినిద్దీన్ మధ్యవర్తిగా ఉండి తమ వద్దకు వచ్చా రని రైతులు తెలిపారు. 120 యూనిట్ల గొర్రెల పంపిణీకి గాను మొత్తం 2 కోట్ల 10లక్షల రూపాయలు నగదు తమకు రావాల్సి ఉందని..ఇప్పటివరకు ఆ డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వకపోగా దుర్భాషలాడుతూ వేధిస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ అధికారులకు ఇచ్చామని రైతులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని తీసుకువచ్చింది. ఒక యూనిట్ విలువ 1.25 లక్షల రూపాయలు కాగా.. అందులో 75 శాతం రాయితీ ఇచ్చింది ప్రభుత్వం. 2021 డిసెంబరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3వేల385 కోట్ల రాయితీ వ్యయంతో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు అంతే సంఖ్యలో గొర్రెల యూనిట్లను సరఫరా చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. గొర్రెల పంపిణి పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక తేల్చింది. దీంతో అసెంబ్లీలో గొర్రెల పంపిణీలోని అక్రమాలపై కాగ్ నివేదిక ప్రవేశపెట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.


