20.7 C
Hyderabad
Friday, February 20, 2026
spot_img

గరం గరంగా మారుతున్న ఏలూరు రాజకీయాలు

      ఏలూరు…ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హాట్‌హాట్‌ రాజకీయాలు సాగే ఎంపీ నియోజకవర్గం. గతంలో ఇక్కడ నుంచి గెలిచిన పలువురు ఎంపీలు కేంద్రంలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. అలాంటి చోటు నుంచి బరిలో దిగేందుకు ఎంతో మంది పోటీ పడుతుంటారు. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాల నుంచి ఎవరు బరిలో దిగుతారు ? గతంలో పోటీ చేసిన మాగంటి బాబే టీడీపీ తరఫున రంగంలో ఉంటారా ? లేక పొత్తులో భాగంగా తెలుగు దేశం పార్టీ ఈ సీటును త్యాగం చేస్తుందా ? అలా జరిగితే మరి దశాబ్దాలుగా స్థానిక రాజకీయాలను శాసిస్తున్న మాగంటి పరిస్థితి ఏంటి ? దీనిపైనే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

     సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పార్లమెంటుతోపాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని స్వయంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. అందుకు తగ్గట్లుగానే అధికార, విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైనాట్ 175 అంటూ నినదిస్తున్న అధికార వైసీపీ 60 మందికి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఇన్‌ఛార్జ్‌ల పేరుతో ప్రకటించింది. అంతేకాదు.. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, నేతలను రాబోయే ఎన్నికల యుద్ధానికి రెడీ చేసేందుకు వీలుగా సిద్ధం అంటూ సభలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. విపక్షాలపై ఈ సభల సాక్షిగా తీవ్రస్థాయిలో విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నారు.

     ఇదే సమయంలో ప్రతిపక్షాలు సైతం అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి రంగం సిద్ధం చేశాయి. ఈ ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌.. ఇరువురూ కలిసి కట్టుగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలు పలుమార్లు సమావేశమై ఎన్నికల బరిలో ఉండే నేతలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించారు. ఎక్కడ ఎవరు పోటీ చేయాలి.. ఎవరు వెనక్కు తగ్గాలి.. ఇలా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. సీట్ల సర్థుబాటు, సీటు దక్కని నేతల్లో అసంతృప్తి లేకుం డా చూడడంతోపాటు పోటీ చేసే వారు, సీట్ల త్యాగం చేసిన వారి మధ్య సమన్వయం ఉండేలా చూసేం దుకు ఏం చేయాలి అన్న దానిపై చర్చోపచర్చలు జరిపారు.

     అయితే.. తమతో బీజేపీ కూడా కలిసి వస్తే మరింత ప్రయోజనం ఉంటుందని భావించిన టీడీపీ, జనసేన అధినేతలు ఆ దిశగా తమ ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో కీలక చర్చలు జరిపారు. పైకి ఏం జరిగిందనే విషయం ఎవరూ చెప్పకపోయినా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయి తే.. సీట్ల విషయం మాత్రం ఇంకా ఫైనలైజ్‌ కాలేదన్న వాదన విన్పిస్తోంది. అయితే.. ఇదే ఇప్పుడు విపక్ష నాయకుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుతో కొందరు అభ్యర్థులకు సీట్లు దక్కవన్నది తేలిపోయింది. ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి కలిస్తే ఇంకా ఆ సంఖ్య పెరుగుతుందన్న ఆలోచనే అన్ని పార్టీల నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ కోవలోనే ఏలూరు ఎంపీ సీటు విషయంలో ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.

    గతంలో టీడీపీ నుంచి పలుమార్లు ఏలూరు ఎంపీగా పోటీ చేసిన మాగంటి బాబు గెలిచారు.. ఓటమి సైతం చవి చూశారు. అయినా వెనక్కు తగ్గేది లేదంటూ మళ్లీ రాబోయే ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వేళ.. ఆ సీటు మాగంటికి దక్కుతుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. నిజానికి ఇక్కడ్నుంచి పోటీ చేసేందుకు టీడీపీ నేతలే కాదు.. జనసైనికులు సైతం ఉత్సాహంగా ఉన్నారు. దీంతో…ఇంకా ఏఏ సీట్లలో ఎవరు పోటీ చేస్తారన్నది తేలనప్పటికీ ఆ సీటు ఎవరికి దక్కుతుంది అన్నది ఫైనల్ కాలేదు. ఇలాంటి నేపథ్యంలో తాను మాత్రం ఏలూరు నుంచి ఎంపీగానే బరిలో ఉంటానని టీడీపీ అధిష్టానానికి తేల్చిచెబుతున్నారు మాగంటి బాబు. అయితే.. పార్టీ నిర్ణయం మాత్రం మరోలా ఉందన్న వాదన విన్పిస్తోంది. ఈసారి ఆయన్ను అసెంబ్లీ బరిలో దింపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు పలు కారణాలు ఉన్నప్పటికీ ఎంపీగా కంటే ఆయనను ఎమ్మెల్యేగానే పోటీ చేయించడం బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. కైకలూరు, దెందులూరు నియోజకవర్గాలను ఇందుకు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, అందుకు స్థానికంగా ఉన్నటు వంటి నేతలు ఎలాంటి అభ్యంతరం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.

     మరోవైపు..బీజేపీ కూడా పొత్తులో ఉంటే…దేశంలో మోడీ వేవ్ ఉందని భావిస్తున్న కమలం నేతలు… సహజంగానే ఎక్కువ ఎంపీ స్థానాలకు పట్టుపట్టవచ్చన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఏలూరు ఎంపీ సీటును కమలానికి ఇచ్చే ఛాన్సుంది. అదే జరిగితే ఇక్కడ్నుంచి బీజేపీ అభ్యర్థిగా అంగ, అర్థ బలం మెండుగా ఉన్న గారపాటి వీరాంజనేయులు పేరు ప్రచారంలో ఉంది. పైగా ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. మరోవైపు.. అధికార పార్టీ మాత్రం ఈసారి ఈక్వేషన్ మార్చి వేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీధర్ ఈసారి అంత సముఖంగా లేకపోవడంతో ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరు సునీల్ కుమార్ యాదవ్‌ను ఖరారు చేసింది. దీంతో.. ఇది కూడా మాగంటి బాబు అభ్యర్థిత్వాన్ని టీడీపీ మార్చాలని భావించటానికి ఒక కారణంగా తెలుస్తోంది. మరి.. చివరికి ఏం జరుగుతుంది.. ఏలూరు నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్