స్వతంత్ర వెబ్ డెస్క్: క్రిష్ణా జిల్లాలోని గన్నవరం(Gannavaram) రాజకీయం మరో మారు గరం గరంగా సాగనుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గన్నవరం వైసీపీ(YCP) నుంచి కీలక నేత యార్లగడ్డ వెంకటరావు(Yarlagadda Venkata Rao) సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.
వంశీ(Vamsi) అధికార పార్టీ ఎమ్మెల్యేగా తమను అనేక ఇబ్బందులకు గురి చేశారని, అలాంటి నేతను వైసీపీలోకి తెస్తే మేము పనిచేయలేమని తెగేసి చెప్పేసారు యార్లగడ్డ వర్గీయులు. ఇదిలా ఉండగా వంశీతో కుదరక వారంతా చాలా కాలంగా సైలెంట్ గానే తమ పని తాము చేసుకుంటున్నారు.
ఇక యార్లగడ్డ అయితే మరో స్టెప్ ముందుకేసి టీడీపీ నేతల టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. ఆయన ఈ మధ్యనే కొన్ని సంచలన కామెంట్స్ కూడా మీడియా ముందు చేశారు. 2024లో గన్నవరం నుంచి తాను పోటీ చేస్తాను అని ఆనాడే చెప్పారు. అయితే పార్టీ పేరు చెప్పలేదు.
ఈ మధ్యలో సీఎం జగన్ ను కలవాలని ఆయన చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. గన్నవరంలో వైసీపీ టికెట్ ని వల్లభనేని వంశీకే వైసీపీ అధినాయకత్వం కన్ ఫర్మ్ చేసింది. దాంతో యార్లగడ్డ కలవాలని చూసినా పెద్దగా అధినాయకత్వం ఆసక్తిని చూపించలేదని అంటున్నారు.
ఆయన ఈ నెల 13న తన అనుచరులు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తన పార్టీ మార్పు గురించి చర్చ జరిగింది అని అంటున్నారు. ఇక ఈ నెల 19 నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర క్రిష్ణా జిల్లాలో ప్రవేశించనుంది అని అంటున్నారు. దాంతో లోకేష్ సమక్షంలో పసుపు కండువాను యార్లగడ్డ కప్పుకుంటారు అని తెలుస్తోంది.
మరి యార్లగడ్డకు 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ టీడీపీ ఇస్తుందా అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే టీడీపీ ఈ సీటుని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కి ఇవ్వాలని, అలాగే వంగవీటి రాధాను పోటీకి నిలబెట్టాలని ఆలోచిస్తోంది. ఒక వేళ అలా కాకపోయినా వంశీని దెబ్బ తీసేందుకు పవర్ ఫుల్ లీడర్ కోసం వెతుకుతోంది.
మరి 2019 లో వంశీ మీద ఓడిన యార్లగడ్డ 2024లో గెలుస్తారు అని టీడీపీ భావిస్తే మాత్రం ఆయనకే టికెట్ అంటున్నారు. ఈ మేరకు హామీ తీసుకునే యార్లగడ్డ పార్టీలోకి వస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా గన్నవరం రాజకీయం గరం గరం గానే ఉండబోతోంది. వంశీ మీద మరోసారి యార్లగడ పోటీకి సై అంటున్నారు. అయితే పార్టీలు అటూ ఇటూ అవుతున్నాయంతే అంటున్నారు. మరి ఈసారి గన్నవరం సీటు ఎవరికి వరం అవుతుందో చూడాల్సి ఉంది.