తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. బిఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కనుంది. గులాబీ పార్టీ నుంచి రాజ్యసభ రేసులో ఉన్న నేతలు ఎవరు…? గులాబీ బాస్ ఎవరికి అవకాశం ఇవ్వనున్నారు.?
తెలంగాణలో ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్ధిరాజు రవిచంద్ర పదవీకాలం ముగియనుంది. ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నందున రాజ్యసభ స్థానాలన్ని బీఆర్ఎస్ కు దక్కాయి. ఇప్పుడు గులాబీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు ఒక్క రాజ్యసభ స్థానం మాత్రమే బిఆర్ఎస్ పార్టీకి దక్కనుంది. ఫిబ్రవరి 27 న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉంటే ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి. ఏ సమస్య ఉండదు. నాలుగో అభ్యర్థి బరిలోకి దిగితే ఎన్నికలు జరుగుతాయి.
తెలంగాణ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు, ప్రతిపక్షంలో వున్న బిఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం దక్కనుంది. ప్రస్తుతం వున్న 119 అసెంబ్లీ స్థానాలకు ఒక్కో రాజ్యసభ సభ్యుని ఎన్నికకు 31 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయి. ఇక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉండగా బిఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు వున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, ఎం.ఐ.ఎం పార్టీలు పాల్గొనకపోతే రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కో స్థానానికి 26 మంది ఎమ్మెల్యేల ఓట్లు మాత్రమే అవసరం అవుతాయి.ఒకవేళ బీజేపీ ఓటింగ్ లో పాల్గొనకుండా ఎం.ఐ.ఎం పార్టీ ఓటింగ్ లో పాల్గొంటే ఒక్కో స్థానానికి 28 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయి.
రాజ్యసభ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఎమ్మెల్యేలకు ఓటు హక్కు వుంటుంది. ఆయా రాజకీయ పార్టీలకు తమ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారా లేదా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యే తమ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బ్యాలెట్ పేపర్ ను పార్టీ ఏజెంట్ కు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత పార్టీ ఏజెంట్ కు ఎమ్మెల్యే చూపించకపోతే ఆ పార్టీకి సబంధించిన ఏజెంట్ అభ్యంతరం తెలిపితే ఆ ఓటు చెల్లకుండా పోతుంది.ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీకి దక్కే అవకాశం వున్న ఒక్క రాజ్యసభ స్థానం ఎవరికి దక్కే అవకాశం ఉందనే దానిపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పదవీ కాలం ముగుస్తున్నముగ్గురు సభ్యుల్లో ఒకరికి అవకాశం ఇస్తారా అనే టాక్ సైతం వినిపిస్తోంది. వద్ధిరాజు రవిచంద్ర,జోగినపల్లి సంతోష్ కుమార్ ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పిస్తారనే చర్చ బిఆర్ఎస్ పార్టీలో జరుగుతోంది.కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకపోతే జోగినపల్లి సంతోష్ కుమార్ కు రెన్యువల్ చేసే అవకాశం వుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక రాజ్యసభ సిట్టింగ్ ఎంపీగా వున్న వద్ధిరాజు రవిచంద్రకు సైతం రెన్యూవల్ చేస్తారనే చర్చ నడుస్తోంది.ప్రస్తుతం వద్ధిరాజు రవిచంద్ర రెండున్నరేళ్లు మాత్రమే రాజ్యసభ ఎంపీగా వున్నారు. బండా ప్రకాష్ ముదిరాజ్ రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన తర్వాత జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో వద్ధిరాజు రవిచంద్ర ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రచార ఖర్చును సైతం భరించారు.దీంతో ఎమ్మెల్యే కోటాలో వద్ధిరాజు రవిచంద్రకు ఎమ్మెల్సీ ఇస్తారని భావించినా ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. దీంతో మరోసారి బీసీ కోటాలో రాజ్యసభ స్థానాన్ని రెన్యూవల్ చేయాలని బిఆర్ఎస్ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. మాజీ పీసీసి అధ్యక్షుడు, మాజీమంత్రి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిన పొన్నాల లక్ష్మయ్య సైతం రాజ్యసభ రేసులో వున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో వుండటంతో రాజ్యసభ అభ్యర్థి ఎంపిక గులాబీ పార్టీకీ కత్తి మీద సాములా ఉంటుంది. పార్టీ తరపున పార్లమెంట్ లో బలమైన వాయిస్ వినిపించడంతో పాటుగా పార్టీకి,అధినేతకు విధేయుడుగా వుండే వారిని ఎంపిక చేయాల్సి వుంటుంది. దీంతో ఈ సారి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి దక్కే ఒక్క స్థానం ఎవరికి దక్కుతుందో చూడాలి.