తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమితో అంతర్మథనం జరుగుతోందా…? ప్రజలకు, కార్యకర్తలకు దూరం అయ్యామని భావిస్తున్నారా…? పార్లమెంట్ రివ్యూ సమావేశాల్లో అగ్రనేతలు బహిరంగంగానే ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నారా…? ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు ఇందులో భాగమేనా…? ప్రజలకు, క్యాడర్ కు దగ్గరయ్యే ప్రయత్నంపై బిఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించిందా…?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి అప్రతిహతంగా సాగిన బీఆర్ఎస్… క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలం గాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఎదురైన ఓటమిని బిఆర్ఎస్ శ్రేణులు జీర్ణించు కోలేకపోతున్నాయి. అందుకే ఓటమి కారణాలపై పార్టీలో చర్చల పరంపర జరుగుతోంది. తెలంగాణ భవన్ వేదికగా వరుసగా పార్లమెంట్ నియోజ కవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్ప టికీ క్రమంగా.. ప్రజలకు, పార్టీ క్యాడర్ కు దూరమయ్యామనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది.
బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రజలకు, క్యాడర్ కు దూరం కావడానికి ఎమ్మెల్యేలే ప్రధాన కారణం అనే భావన పార్టీలో వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను అంచనా వేసి, అధినేత ఫీడ్ బ్యాక్ ఇవ్వడంలో ఎమ్మెల్యేలు దారుణంగా విఫలమయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బిఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దీంతో బిఆర్ఎస్ పార్టీలో అగ్రనేతలకు, క్యాడర్ మధ్య గ్యాప్ వుంది అనే విషయం మరోసారి బహిర్గతం అయినట్లుగా చర్చ జరుగుతోంది.
నిజామాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశాల సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్య లు హాట్ టాపిక్ గా మారాయి. నిజామాబాద్ ఎంపీగా తాను వున్న సమయంలో తనను క్యాడర్ ను కలవకుండా స్థానిక ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పధకాలను గ్రామాల్లో యూనిట్ల వారీగా అందించకుండా వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు ఇచ్చారని దీని వల్ల పార్టీకి నష్టం జరిగిందని కవిత అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత క్షేత్ర స్థాయి లో పని చేసే కార్యకర్తలను కలుసుకోలేకపోయారనే చర్చ జరుగుతోంది. దీని వలన ఎన్నికల సమయంలో పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. పార్టీపరంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది అగ్ర నేతలకు తెలియకుండా ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారని టాక్ వినిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత బిఆర్ఎస్ అధిష్టానం అలెర్ట్ అయింది. పార్లమెంట్ సమీక్ష సమావే శాల నిర్వహణతో క్యాడర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందుబా టులో ఉంటామని బిఆర్ఎస్ అగ్రనేతలు చెప్తూ వస్తున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వంలో వుండటంతో కార్యకర్తలకు అందుబాటులో వుండలేక పోయామని ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాం కాబట్టి బిఆర్ఎస్ కార్యకర్తలకు,శ్రేణులకు అండగా వుంటా మని భరోసా ఇస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని క్యాడర్ కు హామీ ఇస్తున్నారు. తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ మూడవ సారి జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు క్యాడర్ ను కాపా డుకోవడంపై దృష్టి సారించింది. క్యాడర్ ఇతర పార్టీల్లోకి చేజారిపోకుండా పార్టీని బలోపేతం చేస్తామంటూ బిఆర్ఎస్ అగ్రనేతలు చెప్తున్న మాటలు ఆచరణలో ఏ మేరకు అమలు అవుతాయో చూడాలి.