కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌కు బెయిల్ లభించింది. శ్రీనివాస్‌కి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని శ్రీనివాస్‌ను ఆదేశించింది. 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై దాడి కేసులో శ్రీనివాస్‌ను పోలీసుల అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కొద్దిరోజుల క్రితం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని.. దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. శ్రీనివాస్ తరపున లాయర్ పాలేటి మహేశ్ వాదనలు వినిపించారు. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం..కోడికత్తి కేసులో కుట్రకోణం ఉందని లోతుగా దర్యాప్తు చేయాలని..జగన్ తరపున పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది. కేసులో ఎటు వంటి కుట్రకోణం లేదని ఎన్ఐఏ తేల్చింది. గతంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చింది హైకోర్టు.