ప్రధాన ఎన్నికల కమిషనర్ , ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో కూడిన ప్యానెల్ ను నియమించేందుకు వీలు కల్పించే కొత్త చట్టం అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాక రించింది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ధర్మాసనం అంగీకరించినా, ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది. ఈ చట్టం అధికార విభజనకు సంబంధించినదని, కొత్త చట్టం ప్రకారం నూతన నియామకాలు చేపట్టే ముందు దీనిపై స్టే ఇవ్వాలని పిటిషనర్ జయా ఠాకూర్ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు. సిఈసీ, ఈసీ నియామకానికి సంబంధించిన చట్టం 2022 చెల్లు బాటును పిటిషనర్ ప్రశ్నించారు. ఈ చట్టం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని పిటిషనర్ వాదించారు.


