తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదు..! రాబోయే ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో రేవంత్ సర్కారు కుప్పకూలడం ఖాయం..! ఇలా ఒకటీ రెండూ కాదు… ఎన్నో కామెంట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే విన్పించడం ప్రారంభమయ్యాయి. కానీ, ఇప్పుడు చూస్తే నాడు బలహీ నంగా కన్పించిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు బీఆర్ఎస్ ఢీ కొట్టగలదా ? అసలు గులాబీ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, నేతలు ఎంత మంది ? ఇలా ఒకటీ రెండూ కాదు.. అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కొద్ది రోజుల్లోనే అసలు ఎందుకీ పరిస్థితి తలెత్తింది.
ఈ లోగానే ఏం జరిగింది…?
రెండు నెలలు.. కేవలం రెండే నెలల్లో పరిస్థితి మొత్తం మారిపోయిందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన గతేడాది డిసెంబర్ 3 నాటి పరిస్థితికి, రెండు నెలలు ఆగిన తర్వాత అంటే 2024 ఫిబ్రవరి 3 నాటికి పరిస్థితి మొత్తం మారిపోయింది అన్న వాదన బలంగా విన్పిస్తోంది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జవసత్వాలన్నీ కూడదీసుకొని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిం ది. అయితే.. మిత్రపక్షంతో కలుపుకొని 65 సీట్లు గెలుపొంది అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 39 సీట్లు మాత్రమే సాధించింది. మేజిక్ ఫిగర్‌కు అవసరమైన మెజార్టీ కంటే కాస్త మాత్రమే ఎక్కువగా హస్తం పార్టీ సీట్లు సాధించడంతో విపక్షాలు విరుచుకుపడ్డాయి. ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతలు మాటల తూటాలు పేల్చారు. ఆరు నెలల నుంచి ఏడాది లోగా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ జోస్యం చెప్పడం మొదలు పెట్టారు. కారు పార్టీ నేతలు ఇక్కడితోనే ఆగలేదు సరికదా విమర్శల జోరు మరింత పెంచేశారు. మొదట్లో పథకాల అమలుపై రేవంత్ సర్కారుకు కొంత సమయం ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ నేతలు.. ఆ తర్వాత మాత్రం సెటైర్లు వేయడం ప్రారంభించారు. పూర్తిగా హామీల అమలు ఎప్పుడంటా నిలదీయడం ప్రారంభించారు. రుణమాఫీ సంగతేంటని విమర్శనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు.
ఇప్పుడు చూస్తే పరిస్థితి మరోలా ఉందన్న కామెంట్లు విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించ లేదు… పూర్తి కాలం నడవదు.. ఏడాదిలోనే కుప్పకూలుతుంది అని గులాబీ పార్టీ నేతలు అన్న మాటల ఫలితమో.. లేక తెరవెనుక కాంగ్రెస్ మంత్రాంగమో కానీ, ఇప్పుడు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు పోటీ పడుతున్నారు. మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావుతోపాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇప్పటికే రేవంత్‌తో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ నేత, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి సైతం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కారు దిగిన రాజయ్య హస్తం పార్టీకే జైకొట్టారు. వీరే కాదు.. మరికొందరు సైతం కాంగ్రెస్ పార్టీ నీడన చేరేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. పైకి అంతా అభివృద్ధి కోసమేనని, ప్రోటోకాల్ కోసమే ముఖ్యమంత్రిని కలుస్తున్నామని చెబుతున్నారు. కానీ, వీరి మాటలు వింటుంటే గత బీఆర్ఎస్ పాలనలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అప్పట్లో ఇదే మాదిరిగా చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయన్న కామెంట్లు విన్పిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీ నేతల్నే కట్టడి చేయలేని పరిస్థితుల్లో ఉన్న బీఆర్ఎస్.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నూతనోత్సాహంతో దూకుతున్న కాంగ్రెస్‌ను ఎలా కట్టడి చేయగలదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.