కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా జార్ఖండ్ లో పర్యటిస్తున్న రాహుల్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. 50 శాతం రిజర్వేషన్ల పై ఉన్న పరిమితిని తొలగిస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తొలి వాగ్దానం చేశారు. జార్ఖండ్ లోని కుంతి నుంచి గుమ్లా వరకూ భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగింది. స్కూల్ పిల్లలు రాహుల్ గాంధీకి స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ రిజర్వేషన్ల పరిమితుల కారణంగా.. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులకు కోర్టులు, కార్పొరేషన్ సంస్థల బోర్డులు, యూనివర్సిటీల ఉపాధ్యా యుల పోస్ట్ లలో భాగస్వామ్యం లేకుండా పోతోందని, వారంతా వెట్టిచాకిరీ చేసుకు బతకాల్సివస్తోందని ఆవేదనతో చెప్పారు. 1992 సుప్రీంకోర్టు తీర్పు వల్ల రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి వచ్చింది. సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూ ర్తుల ధర్మాసనం ఓబీసీలు అంటే ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించినా రిజర్వేషన్లు మాత్రం 50 శాతానికే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..దేశవ్యాప్తంగా కుల ప్రాతిపదికన జనగణన చేపడుతుందని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.