మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరనున్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.
ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేనకి కేటా యించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మిలింద్ దేవరా పార్టీ నుండి వైదొలగడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మండిపడ్డాడు. మిలిం ద్ దేవరా తండ్రి మురళీ దేవరాతో ఉన్న సుధీర్ఘ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. మురళీ దేవరాతో తనకు సుదీర్ఘ కాలం పాటు అనుబంధం ఉందన్నారు. తాము ఎంతో అభిమానంతో ఉండేవాళ్లమని చెప్పారు. ఆయనకు అన్ని రాజకీయ పార్టీలలో సన్నిహిత మిత్రులు ఉన్నారన్నారు. కానీ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే ధృడమైన కాంగ్రెస్‌వాది నంటూ స్పష్టం చేశారు.