బడ్జెట్ సమావేశాల వేళ మరోసారి తెరపైకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారికి తగినంత సంఖ్యా బలం లేకుంటే హోదా సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అదే సమయంలో స్పెషల్ స్టేటస్ అంశంతోపాటు విభజన హామీలపై చర్చించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రితోపాటు టీడీపీ అధినేత చంద్రబాబును డిమాండ్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిల. ఓవైపు రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదా అన్న అంశం ముగిసిన అధ్యాయమని కేంద్రం ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా ప్రకటించింది. దాదాపుగా ఇప్పుడు ఏ పార్టీ కూడా ఆ విషయం గురించే ప్రస్తావించడం లేదు. మరి… ఇలాంటి వేళ ఇంకా చెప్పాలంటే సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఇటు వైసీపీ.. అటు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రత్యేక హోదా అంశం గురించి ప్రస్తావించాయి. ఇదే ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చగా మారింది.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీలోని అధికార విపక్షాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే ఎవరికీ అంతుపట్టని రీతిలో రాజకీయం చేస్తూ ప్రత్యర్థులను బోల్తా కొట్టించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఈ విషయంలో ఒక్కో పొలిటికల్ పార్టీది ఒక్కో స్టైల్. బడ్జెట్ సమావేశాల వేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరిస్తూ పలు అంశాలపై మాట్లాడారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి కలిగే ఎన్నో ప్రయోజనాలు దూరమయ్యాయని.. అందువల్లే ఆర్థికంగా రాష్ట్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోందని తెలిపారు. అయినా సరే గత ప్రభుత్వం కంటే సమర్థంగా పనిచేశామని చెప్పుకొచ్చారు సీఎం జగన్. అదే సమయంలో స్పెషల్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి… కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి తగినంత సంఖ్యా బలం లేకుండా ఉంటే.. ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని దీమా వ్యక్తం చేశారు.
సీఎం జగన్ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన మరుసటి రోజే ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిల సైతం ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విభజన సమయంలో హామీ ఇచ్చినట్లుగా ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విభజన సమస్యల పరిష్కారం కోసం ఇటు అధికార వైసీపీ…అటు ప్రతిపక్ష టీడీపీ కలిసి పోరాటం చేయాలని డిమాండ్ చేశారామె. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి రెండు పార్టీలు ఆమెదించాలని సూచించారు షర్మిల. అనంతరం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రంతోపాటు రాష్ట్రపతికి పంపాలని కోరారు ఏపీ పీసీసీచీఫ్.
నిజానికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం గురించి గళం ఎత్తడం తప్పు కాదు.. మహాపాపం అంతకంటే కాదు. కానీ, మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇచ్చిన అనేక ముఖ్యమైన విభజన హామీల విషయాన్ని ప్రధాని మోడీ నేతృత్వం లోని ఎన్డీఏ సర్కారు ఏ మాత్రం అమలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. పైగా ప్రత్యేక హోదా విషయాన్ని15వ ఆర్థిక సంఘం పేరు చెప్పి తెలివిగా కేంద్రం పక్కకు తప్పించేసింది అన్న వాదన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో బలంగా ఉంది. ఇక, ఇదే అంశంపై గతంలో జగన్ చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి.. కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రకటించారు వైసీపీ అధినేత. కానీ, ఫలితాల్లో చూస్తే ఎవరి అవసరం లేకుండానే బీజేపీ మేజిక్ ఫిగర్ చేరుకోవడంతో ఆ ఆశలు నీరుగారిపో యాయి. దీంతో.. ఇప్పుడు మరోసారి కేంద్రంలో ఉండే ఏ పార్టీకి మెజార్టీ రాకూడదని తాను ప్రార్థిస్తున్నానంటూ చెప్పడం తో సీఎం జగన్ సైతం కాడి పక్కన పడేశారన్న విషయం అందరికీ శాసనసభ సాక్షిగా మారోసారి అర్థమైందనే చెప్పాలి. మరి.. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు ప్రత్యేక హోదా అంశాన్ని ఇటు జగన్, అటు షర్మిల తీసుకొచ్చారంటే ఏదో మతల బే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వై.ఎస్ జగన్, షర్మిల వేర్వేరు కాదన్న ఆరోపణలు విన్పిస్తూనే ఉన్నాయి. ఇలాంటి వేళ ఇరువురూ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న కామెంట్లు బలంగా విన్పిస్తున్నాయి.
అయితే.. కాంగ్రెస్ నేతలు ఇక్కడితో ఆగడం లేదు. కేంద్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకమే రాహుల్ చేతి మీదుగా ప్రత్యేక హోదా ఫైలుపై చేయిస్తామని ప్రచారం చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. తద్వారా రాష్ట్రంలోని ఇతర పార్టీలు చేయని, చేయలేని పనిని మేము చేస్తామని ప్రజల్లో నమ్మకం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. అయితే.. ఇక్కడే ఓ విషయాన్ని అంతా ఆలోచించాలంటున్నారు విశ్లేషకులు. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ? కనీసం గౌరవ ప్రదమైన స్థాయిలోనైనా సీట్లు తెచ్చుకోగలదా..అని ప్రశ్నిస్తున్నారు. ఇక, కేంద్రం విషయానికి వస్తే ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ… ఎన్డీఏ నేతృత్వంలోని మోడీ సర్కారును ఢీ కొట్టగలదా..అన్నదే ప్రధాన ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే కూటమికి గుడ్‌బై చెప్పేస్తున్నారు కీలక నేతలు. ఇలాంటి వేళ కాంగ్రెస్ ముందుండి నడిపిస్తున్న ఇండియా కూటమికి అధికారం అనేది అంత తేలికైన పనైతే కాదన్న వాదన బలంగా ఉంది. పోనీ, ఒకవేళ కేంద్రంలో ఇండియా కూటమి వచ్చినా.. ఇప్పటికే అనేక రాష్ట్రాలు మాకూ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ పక్కకు పెట్టి మరీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే సాహసం చేస్తారా అంటే సమాధానం లేని ప్రశ్నలే.
ఇప్పటికే రాష్ట్రంలో రైతులు, ఇసుక, విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అనేక సమస్యలు ఉన్నాయి. ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ తన మిత్రపక్షమైన జనసేనతో కలిసి వాటిపై పోరాడుతోంది. ఒక్కో సమస్యపై గళమెత్తు తోంది. దీంతో ప్రజల దృష్టి ఇప్పుడు ఆయా సమస్యలపై నెలకొంది. అయితే.. ఇలాంటి పరిస్థితి ఉంటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ అధికార వైసీపీకి ఇబ్బందేనని చెప్పాలి. పైగా ఇప్పటికే ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులతో వైసీపీపై ఎమ్మెల్యేలు, టికెట్ దక్కని నేతలు, ఆశావహుల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి ఉంది. ఇది కూడా కలిసిందంటే జరిగే అనర్థాన్ని అధికార పార్టీ సైతం ఎదుర్కోవడం అంత తేలికకాదు. అందుకే ఏపీ సీఎం వైఎస్ జగన్ కావాలనే అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారని అంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే షర్మిల కూడా అన్న బాటలోనే నడిచారనే ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి హోదా అంశాన్ని తెరపైకి తేవడం ద్వారా ప్రజల సెంటి మెంట్‌తో ముడిపడిన అంశం కావడంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోపాటు మిత్రపక్షంగా ఉన్న జనసేన సైతం తప్పకుం డా హోదా విషయంలో గళం విప్పాల్సి ఉంటుంది. అలా జరగడం ద్వారా 2014లో ఏం జరిగింది.. అసలు అప్పుడు ఎవరు ఎలా స్పందించారు అన్న అంశాలు వరుసగా చర్చకు వస్తాయి. తద్వారా ఎన్నికల వేళ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు పక్కదారి పడతాయి. అదిగో సరిగ్గా అదే కావాలని, జరగాలని వైసీపీ కోరుకుంటోందని..అందుకే వైసీపీ నేతలు ఇంకా ప్రత్యేక హోదా ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసని చెబుతున్నారనే వాదన విన్పిస్తోంది. మరి.. ఈ విషయంలో టీడీపీ, జనసేన ఏం చేయబోతున్నాయి ? అధికార పార్టీ వ్యూహాన్ని ఎలా దెబ్బకొట్టబోతున్నాయి అన్నది ఆసక్తి రేపుతోంది.