రాజ్యసభ ఎన్నికల వేళ ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల తో పాటు.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది ఆసక్తికరం గా మారింది.. అయితే, ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా మరోసారి రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.. ఉదయం విచారణకు రావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు స్పీకర్. మధ్యాహ్నం విచారణకు రావాలని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరికి నోటీసులు ఇచ్చారు. అయితే, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను మూడోసారి విచారణకు పిలిచారు స్పీకర్ తమ్మినేని. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే మూడుసార్లు విచారణ కొనసాగింది.. మరోవైపు ఇప్పటికే రెండు సార్లు స్పీకర్ ఎదుట హాజరయ్యారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఒక్కసారి హాజరయ్యారు రెబెల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అసలు ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాం, మద్దాలి గిరి. ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకు ముందు స్పీకర్ నోటీసులు జారీ చేయగా, వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్‌కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ పంపించారు.