తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని లోపలేయడం, ఆ పార్టీ క్యాడర్‌ను భయపెట్టడం లాంటి రౌడీ యిజం చేయడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలిగామంటూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అనుచరుల వద్ద ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమవుతున్నాయి.టెక్కలి నియోజకవర్గం లోని 55 సర్పంచ్ స్థానాల్లో వైసీపీ మద్దతుదా రులు గెలుస్తారని, మిగిలినవన్నీ టీడీపీ గెలుస్తుందని దువ్వాడ చెప్పుకొచ్చారు. నిమ్మాడలో తమకు మద్దతు ఇచ్చే కింజరాపు అప్పన్నను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా టీడీపీ వారు ఇబ్బంది పెట్టారని…. అప్పుడు తాను ఆ ఊరిపై దాడిచేసి ఆయన తో నామినేషన్ వేయించానని వివరించారు. అచ్చెన్నాయుడు తనను కొట్టారని ఆరోపించి ఆయనను జైలులో పెట్టించామన్నారు. సంతబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పుక్కళ్ల శ్రీనివాస్‌ను హెచ్చరించి ఆయనపై రౌడీషీట్ తెరిపించి అరెస్ట్ చేయించామని ఆయన అనుచరులతో మాట్లాడారు. కోటబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పూజారి శైలజ భర్త సత్యాన్ని ఇంట్లోనే బంధించామని చెప్పుకొచ్చారు. టెక్కలి, నందిగామ జడ్పీటీసీ అభ్యర్థులను బయటకు రాకుండా చేశామని…ఇవన్నీ చేస్తే నాలుగు ఎంపీపీ, నాలుగు జడ్పీటీసీ, 136 పంచాయతీల్లో 119 పంచాయతీల్లో విజయం సాధించామని అన్నారు. అచ్చెన్నాయుడిని లోపలేయడం, ఆ పార్టీ క్యాడర్‌ను భయపెట్టడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవగలిగామన్నారు. ప్రస్తుతం దువ్వాడ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.